అత్తింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య

నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గడ్డం స్వప్న (22) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు.

Update: 2024-05-02 13:18 GMT

దిశ,నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గడ్డం స్వప్న (22) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ మండలంలోని ఆకుల లింగాపూర్ గ్రామానికి చెందిన స్వప్నకు నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన గడ్డం రాజుతో మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం రెండు సంవత్సరాల పాప కలదు. గత కొన్ని రోజులుగా భర్త రాజు బతుకుదెరువు కోసం పెయింటింగ్ పనులు చేస్తూ హైదరాబాద్​లో ఉంటున్నాడు.

    భార్య స్వప్నతో పాటు అత్త రత్నవ్వ, మామ క్రీసూస్తం కలిసి ఆరేడు గ్రామంలో ఉంటున్నారు. తరచూ అత్తా మామ కలిసి కోడలును వేధిస్తుండడంతో స్వప్న గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధాకర్ పరిశీలించి స్వప్న తల్లి జంగిలి సాయవ్వ ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించారు. 

Similar News