భారీ వర్షం..పిడుగుపాటుకు పశువుల కాపరి దుర్మరణం

ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడి ఇక తల్లడిల్లిన ప్రజానీకం మబ్బు పట్టిన ఆకాశం వైపు చూస్తూ చల్లని ఈదురు గాలులను ఆస్వాదించారు.

Update: 2024-05-07 14:05 GMT

దిశ ప్రతినిధి,ఏలూరు: ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడి ఇక తల్లడిల్లిన ప్రజానీకం మబ్బు పట్టిన ఆకాశం వైపు చూస్తూ చల్లని ఈదురు గాలులను ఆస్వాదించారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల, పెదవేగి, దెందులూరు, పెదపాడు, చింతలపూడి, లింగపాలెం, పోలవరం మండలాల్లో మధ్యాహ్నం నుండి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనికి ఉరుములు, మెరుపులు తోడయ్యాయి. ఏలూరు సహా జిల్లాలోని పలు చోట్ల మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది.

లింగపాలెం మండలం యడవల్లిలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా పిడుగు పాటుకు పశువులతో పాటు మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో భారీ వర్షానికి డ్రైనేజీలు ప్రధాన రహదారులు పొంగిపొర్లాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండల కేంద్రం ఆచంటతోపాటు, కొడమంచిలి,శేషమ్మ చెరువు, కోడేరు,ఆచంట వేమవరం తదితర గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తూ, చినుకులు మొదలయ్యాయి. మరోపక్క ఈదురు గాలులు, వర్షం వల్ల చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళనలో ఉన్నారు.

Similar News