కరోనా ఉంది వద్దు.. అమిత్ షా సభ రద్దు

by  |
కరోనా ఉంది వద్దు.. అమిత్ షా సభ రద్దు
X

దిశ, న్యూస్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ సభకు కరోనా సెగ తగిలింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు బయట పడుతుండటం, హైదరాబాద్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఎల్బీస్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాలేకపోతున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో సభను రద్దు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించగా ఆయన సమ్మతించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆహ్వానించారు. దానికి జనసేనాని అంగీకరించడంతో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, ఏఐఎంఐఎం పార్టీల సీఏఏ వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని ఆ పార్టీ నాయకులు భావించారు. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే, సభకు రాలేకపోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు సమాచారం అందించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 28 మంది ఆ మహమ్మారి బారిన పడినట్లు కేంద్ర వైద్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. హైదరాబాద్‌లో కూడా ఓ కరోనా కేసు బయటపడింది. ఇలాంటి తరుణంలో భారీ బహిరంగసభలు నిర్వహించడం మంచిది కాదని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి సమాచారం పంపించారు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతుండగా.. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉండటంతో ఈ నెల 15న హైదరాబాద్ సభకు అమిత్ షా రాలేకపోతున్నారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో సభను రద్దు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు.

tags : bjp, coronavirus, sabha, amit shah, telengana, hyderabad, laxman

Next Story