అంతన్నరు, ఇంతన్నరు.. కానీ!

by  |
అంతన్నరు, ఇంతన్నరు.. కానీ!
X

దిశ, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తెలంగాణ సమాజం రుణపడి ఉంది. రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం పరిధిలో ఉండాలని, ఆయన చేసిన చట్టం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, జయంతి వేడుకలు ఎంత బాగా నిర్వహించినా తక్కువేనని.. 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. అంతే కాదు, అంబేద్కర్ టవర్ పేరుతో 15 అంతస్తుల భవనం, 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు. అయితే ఆ భూమి పూజ కార్యక్రమానికి నాలుగేళ్లు నిండినా అక్కడ తట్ట మట్టి కూడా తీయకపోవడం గమనార్హం.

ఆచరణకు నోచుకోని సీఎం మాటలు..

అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఏడాదంతా ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావం 2014 తర్వాత 2015లో అంబేద్కర్ జయంతికి గైర్హాజరైన సీఎం కేసీఆర్.. 2016లో 125వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ప్రాధాన్యతను చెప్పడమే కాకుండా, దళితుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలపై ప్రసంగించారు. ఇదే సమయంలో ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ అంతా ఒకే చోట ఉండాలంటూ.. అందుకు రూ.100 కోట్ల వ్యయంతో 15అంతస్తుల్లో అంబేద్కర్ టవర్ నిర్మాణం చేపడుతామని తెలిపారు. బుద్ధుడి ఆశయాలు, ఆలోచనలు కలిగిన అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో అంబేద్కర్‌కు ముందు బుద్దుడు, వెనుక సచివాలయం ఉంటుందని.. తద్వారా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలుస్తోందని చెప్పారు. కానీ, ఆ మాటలు నేటికీ ఆచరణకు నోచుకోకపోవడం గమనార్హం.

భూమి పూజకు నాలుగేళ్లు..

2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్.. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహానికి ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 15 అంతస్తుల భవనానికి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ఆవరణలో శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రభుత్వం ఆధ్వర్యంలో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహానికి నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చైనా వెళ్లి అధ్యయనం చేసి రావాలని అనుకున్నా… ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడుకే పరిమితమైంది. అయినా.. భారీ విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ శంకుస్థాపనలు జరిగి నాలుగేళ్లు అవుతున్నా పనులు మొదలు పెట్టకపోవడంతో అక్కడ తాగి పడేసిన మందు గ్లాసులు, పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. మళ్లీ వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి వరకు అయినా 125 అడుగుల కాంస్య విగ్రహం, 15 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణాలకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.

Tags: Ambedkar Statue, Tower, Foundation, Tank Bund, CM KCR, Hyderabad, NTR Garden, Telangana

Next Story