డీజిల్‌లో కిరోసిన్ కలిసిందని గొడవ.. తీవ్ర వాగ్వాదం

719

దిశ, అన్నపురెడ్డిపల్లి: పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరడంతో సామాన్యులపై మోయలేని భారం పడినట్లయింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ పంపు మీటర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొంచెం తేడా అనిపించినా నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తున్న గిరిజన ఫిల్లింగ్ స్టేషన్ లో డీజిల్ లో కిరోసిన్ కలిసి కల్తీ అయ్యిందని ఆరోపిస్తూ బంకు నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. బుధవావారం చండ్రుగొండ డిసిసిబి బ్యాంకుకు చెందిన సిబ్బంది విధుల నిమిత్తం జీపులో అన్నపురెడ్డిపల్లి వచ్చారు. తిరిగి వెళ్ళే సమయంలో జి సి సి ఆధ్వర్యంలో నడుస్తున్న స్థానిక భారత్ పెట్రోలియం బంకులో డీజిల్ పోయించుకుంటుండగా కిరోసిన్ వాసన వస్తుందంటూ జీపు డ్రైవర్ ఎస్కే అంజాద్ సిబ్బందిని నిలదీశాడు.

జీపులో కోట్టిన వెయ్యి రూపాయల డీజిల్ వాపస్ తీసుకొని తమ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆందోళనకు దిగాడు. ఈ విషయంపై స్థానిక జీసిసి సేల్స్ మేన్ ఫిల్లింగ్ స్టేషన్ ఇన్ఛార్జ్ తన పైఅధికారికి ఫోన్లో సమాచారం అందిస్తూ నిజంగానే డీజిల్ కిరోసిన్ వాసన వస్తుందని తెలపడాన్ని డ్రైవర్ ఎస్కే అంజాద్ తోటి సిబ్బంది గమనించడంతో వాగ్వాదం మొదలైంది. దమ్మపేట డిపో జీసీసీ మేనేజరు సుగ్గల నరసింహరావు హుటాహుటిన బంకు వద్దకు చేరుకుని డీజిల్ లో కిరోసిన్ కలిసే అవకాశమే లేదని ఆందోళన చేస్తున్న వారితో వాదనకు దిగారు. అనవసరంగా సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తే పోలీస్ కేసు పెడతామన్నారు. డీజిల్ లో కిరోసిన్ కలిసి కల్తీ అయి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేయడం తప్పెలా అవుతుందని వినియోగదారులు ఎదురు ప్రశ్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి సమస్యను పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవాలని కోరడంతో, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదే విషయంపై డిపో మేనేజర్ సుగ్గుల నరసింహారావును వివరణ కోరగా ఫిల్లింగ్ స్టేషన్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, డీజిల్ ను రెవెన్యూ సిబ్బంది పరీక్షలు నిర్వహించడానికి ఇచ్చామని తెలిపారు.