ఏసీబీలో అవినీతి ఘనులు.. మిస్టరీగా మారిన మనీ, గోల్డ్ మిస్సింగ్..

by  |
ఏసీబీలో అవినీతి ఘనులు.. మిస్టరీగా మారిన మనీ, గోల్డ్ మిస్సింగ్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇంటి దొంగలను ఈశ్వరుడైనా గుర్తించలేడన్న సామెతకు తగ్గట్టుగా ఓ డీఎస్పీ వ్యవహరించారు. అవినీతిపరుల గుండెల్లో పరుగులు పెట్టించే విభాగంలో పని చేస్తున్న సదరు డీఎస్పీ ఏకంగా ట్రాప్ కేసులో పట్టుకున్న డబ్బు మాయం చేయడంతో పాటు, రికవరీ చేసిన బంగారు ఆభరణాల స్థానంలో గిల్టు నగలు పెట్టారని ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలడంతో డీఎస్పీగా పని చేస్తున్న వేణు గోపాల్‌ను ఏసీబీ డీజీపీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లాలో నమోదైన మూడు కేసుల్లో రికవరీ చేసిన బంగారంలో సుమారు 15 తులాల బంగారాన్ని మాయం చేసి రోల్డ్ గోల్డ్ నగలను ఉంచినట్టు ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. అలాగే, లంచం తీసుకుంటుండగా నగదు పట్టుకున్న కేసుల్లో కోర్టులో డిపాజిట్ చేసిన డబ్బును కూడా మాయం చేశారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. రూ. 2 లక్షల మేర నగదు దారి మళ్లినట్టుగా నిర్దారించడంతో పోలీసు ఉన్నతాధికారులు క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

కీలక ఆధారాలు..

సాధారణంగా ట్రాప్ కేసుల్లో అత్యంత కీలకమైన ఆధారం లంచం తీసుకున్న డబ్బే. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న తరువాత అవినీతికి పాల్పడిన వారికి కెమికల్ టెస్ట్ చేస్తుంటారు. ఈ కెమికల్‌ టెస్టుతో పాటు పట్టుబడ్డ నగదుపై ఉన్న సీరియల్ నెంబర్లను కూడా కోర్టులో దాఖలు పరుస్తారు. నగదును కూడా కోర్టులో డిపాజిట్ చేసినప్పటికీ ఏసీబీ కస్టడీలో ఉంచాలని ఆదేశాలు ఇస్తుంటుంది కోర్టు.

ట్రాప్ కేసుల్లో కీలక ఆధారంగా నిలిచే ఆ నగదు విషయంలో ఏసీబీ అధికారులు పకడ్బంధీ జాగ్రత్తలు తీసుకుంటారు. కోర్టు ఆదేశించిన తరువాత తిరిగి ఈ నగదును ఏసీబీ అధికారులు జడ్జీ ముందు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అయితే కేసులో అత్యంత కీలకమైన నగదు విషయంలో సదరు డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించి అతనిపై వేటు వేశారు. కరీంనగర్ ఏసీబీ ఆఫీసు పరిధిలో నమోదైన మరో కేసులో అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలను ఉంచినట్టు గుర్తించిన అధికారులు శాఖపరంగా విచారణ చేపట్టారు.

యాధృచ్చికమా.. ఇంటెన్షన్‌తోనా..?

కరీంనగర్ ఏసీబీ ఆఫీసులో జరిగిన బంగారం, నగదు మిస్సింగ్ వ్యవహారం యాధృచ్చికంగా జరిగిందా.? లేక ఇంటెన్షన్ పెట్టుకుని దారి మళ్లించారా అన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ట్రాప్ కేసుల్లో బలమైన సాక్ష్యంగా ఉపయోగపడే నగదు మిస్సింగ్ కావడంలో ఎవరెవరి ప్రమేయం ఉంది..?

వాటిని మాయం చేయడానికి కారణాలు ఏంటీ అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ట్రాప్ కేసుల్లో పట్టుబడ్డ ప్రభుత్వ యంత్రాంగానికి కోర్టులో శిక్ష పడకుండా ఉండేందుకు కీలకమైన సాక్ష్యం లేకుండా చేశారా.? లేక మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు సమాచారం.

క్రిమినల్ చర్యలు..

కరీంనగర్ జిల్లాలోని మూడు కేసుల్లో జరిగిన ఈ తతంగానికి బాధ్యున్ని చేస్తూ ఉన్నతాధికారులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. కరీంనగర్ ఇంఛార్జీ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ వ్యవహారానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేపట్టడం ఆరంభించారు.

ఇటీవల ఆయన కరీంనగర్ నుంచి నిజామాబాద్‌కు బదిలీ అయిన తరువాత ఛార్జీ అప్పగించడంతో ఈ గుట్టు రట్టయినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే మిస్సింగ్ మిస్టరీ జరిగినప్పటికీ సదరు అధికారి ప్రమోషన్ కోసం సీక్రెట్‌గా మెయింటెన్ చేశారని సమాచారం.

స్టేట్ వైడ్ హై అలెర్ట్..

కరీంనగర్ జిల్లాల్లో వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఏసీబీ ఉన్నాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఓ వైపున ఈ కేసుపై డిపార్ట్‌మెంటల్ విచారణ జరుపుతూనే రాష్ట్రంలోని అన్ని సబ్ డివిజన్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత ఏసీబీ సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఇప్పటి వరకు నమోదైన కేసులు, కోర్టులో విచారణ జరుగుతున్న కేసుల వివరాలతో పాటు ఆయా కేసుల్లో రికవరీ అయిన నగదు, బంగారంతో పాటు, స్థిర చరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసి నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏసీబీ అధికారులు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కోర్టుకు నివేదించిన రికార్డులు, ఆఫీసుల్లో డిపాజిట్‌గా ఉన్న వివరాలను సరి చూసుకుంటున్నారు ఆయా జిల్లాల అధికారులు.

Next Story

Most Viewed