మూడు విభాగాలు ఒక్కటై సహాయక చర్యలు

by  |
మూడు విభాగాలు ఒక్కటై సహాయక చర్యలు
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్ వాయువు లీకై ప్రజలను తీవ్ర ప్రమాదంలో పడేసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది హుటాహుటీన సహాయకచర్యల్లోకి దిగింది. ఈ క్రమంలో పలువురు పోలీసు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ సహాయక చర్యలు ఆపకుండా చేసుకుపోతున్నారు.

భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో స్పృహతప్పి పడిపోవడంతో వారందర్నీ పోలీసులు 25 అంబులెన్సుల్లో తరలిస్తున్నారు. ఇంతలో వారికి కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎప్ బలగాలు జత కలిశాయి. రోడ్లపై బాధితులతో పాటు వాయువ ధాటికి తాళలేక తలుపులు మూసుకుని ఇళ్లలో స్పృహ తప్పి పడిపోయిన ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఎంత మంది ఇలా బాధితులుగా మారారో తెలియక తలుపులు బద్దలు కొట్టి మరీ బాధితులను రక్షిస్తున్నారు.

బాధితులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో కూడా బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వీరికి నేవీ సిబ్బంది జత కలిశారు. సంఘటనా స్థలికి అంబులెన్స్‌లు, మెడికల్ కిట్లు, ఆక్షిజన్ సిలెండర్లతో పాటు నేవీ వాహనాలను అందుబాటులోకి తెచ్చి రంగంలోకి దిగింది. దీంతో సహాయక చర్యలు దిశ మారిపోయింది. యుద్ధ ప్రాతిపదికన తలుపులు పగుల గొట్టడం బాధితులను వాహనాల్లో ఎక్కించి చికిత్స అందిస్తూ, ఆస్పత్రులకు తరలించడం జరుగుతోంది.

ముడు విభాగాలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవడంతో స్థానికులు వారికిసహాయసహకారాలందిస్తున్నారు. దుర్ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ 200 మంది వరకు బాధితులు ఉన్నారని ప్రకటించగా, బాధితుల సంఖ్య 300 ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Tags: vizag, lg polymers, styrene chemical leak, police, ndrf, indian navey, rescue operetion,

Next Story