జాతీయ విద్యా విధానానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలి: గవర్నర్ తమిళి సై

by  |
governer
X

దిశ, సికింద్రాబాద్ : జాతీయ విద్యా విధానానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. సినర్జింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాంట్టెక్ట్స్ ఆఫ్ ఎన్.ఈ.పి-2020: స్ట్రాటజీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును బుధవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉస్మానియా యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం, ఇక్కడ చదివిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ ఈ పి) అనేది చాలా గొప్ప నిర్ణయం, అందులో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు దిశగా అన్ని యూనివర్సిటీల వీ.సి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాం, తర్వాత విడి విడిగా అన్ని యూనివర్సిటీల వీ.సి లతో మాట్లాడి, విద్యార్థుల సమస్యలు, బోధన బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. యూనివర్సిటీలోని సమస్యలను, ప్రస్తుత పరిస్థితులను ముందుగానే తెలుసుకున్నానన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

నేను వైద్యురాలిని, వైద్యం చేసే ముందు వ్యాధి నిర్ధారణ జరగాలి, దానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేయాలి అప్పుడే వ్యాధికి సరియైన చికిత్స చేయగలం, అదేవిధంగా ఎన్.ఈ.పి అమలుకు యూనివర్సిటీల పరిస్థితి లోటు పాట్లను తెలుసుకున్నాకే నిర్ణయానికి వచ్చామన్నారు. ఎన్.ఈ.పి అమలు కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల యునివర్సిటీలు సహకరించాలని కోరారు. ఎన్.ఈ.పి లోని కొన్ని అంశాల పట్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయనీ, అవన్నీ పక్కన పెట్టాలన్నారు. ఎన్.ఈ.పి నీ రూపొందించేందుకు ఎంతో మంది మేధావులు, నిపుణులు సుదీర్ఘ కాలం చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించి భారత దేశ ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఎన్.ఈ.పి ని రూపొందించినట్లు తెలిపారు. ఉన్నత విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో దూసుకుపోతుందని, ఉన్నత విద్యలో మహిళల నమోదు ఎక్కువగా ఉందని, రాష్ట్ర గవర్నర్ గా ఇది నాకు గర్వంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ నీ త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళలు ఉన్నత విద్యలో ఎక్కువ శాతం ఉన్నపటికీ పి.జి లు పూర్తి చేసి ఆపేస్తున్నారు. ఎక్కువ శాతం మహిళలు సేఫ్ అండ్ సెక్యూర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. రీసెర్చ్ కోర్సెస్ వైపు ఎక్కువ ప్రాధాన్యత ఎంచుకుని దానిని వారు అధిగమించాలన్నారు. కేంద్రం మహిళల కనీస వివాహ వయస్సు 21కి పెంచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో దేశంలో ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించిన యూనివర్సిటీలలో తెలంగాణ ముందుందన్నారు.

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆండ్రాయిడ్ మొబైల్స్, లాప్ టాప్ లు లేక ఇబ్బందులు పడ్డారని, వారికి యూసభుల్ అన్ యూస్ లాప్టాప్ టూ పీపుల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలాంటివారికి మరియు అంగవైకల్యం ఉన్న వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్.ఈ.పి అమలు చేస్తే విద్యా విధానం గోల్డెన్ డైమండ్ ఇన్ క్రౌన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా నిలిచిపోతుందన్నారు. ప్రతిఏటా ఉన్నత విద్య కోసం మన దేశం నుండి 10 లక్షల మంది విదేశాలకి వెళ్తున్నారు. విదేశాల నుండి మన దేశానికి 50 వేల మంది వస్తున్నారు. జాతీయ విద్యా విధానం వల్ల ఈ పరిస్థితి మారుతుందన్నారు. భారతీయ విద్యార్థులకు శక్తి సామర్ధ్యాలు, మేధా శక్తి ఎక్కువగా ఉంటుంది. పటిష్టంగా ఎన్.ఈ.పి అమలు చేస్తే భారత్ విశ్వ గురు స్థానానికి చేరే సమయం త్వరలోనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల వర్సిటీ వీ.సి లతో పాటు, రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీ.సి లు తదితరులు పాల్గొన్నారు.

Next Story