అంతర్జాతీయ సమస్యగా రేసిజం

by  |
racism
X

దిశ, ఫీచర్స్ : కేవలం ‘నలుపు-ఎరుపు’ వర్ణాలకే ‘జాత్యహంకారం’ పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా ‘ఏషియన్లు’ రేసిజం పేరుతో వివక్షకు గురవుతుండగా, వారిపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. చాలా విస్తృతమైన ఈ అంశంలో జాతి, రంగు మాత్రమే కాదు.. మీరు ఎలా కనిపిస్తున్నారన్నది కూడా ప్రధానాంశమే. ‘చూడా, చమర్, కాలా, గోరా, చైనీస్’ వంటి పదాల్లోనూ రేసిజం తొంగిచూస్తోంది. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి నేటి చిన్నారుల వరకు ‘రేసిజం’ ఎదుర్కొంటున్న వాళ్లు అనేకం. ఈ క్రమంలో జాతిబేధాలతో పోరాడేందుకు ఎంతోమంది గళం విప్పుతున్నా సరే.. ఆ ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. తన రంగు కారణంగా హాలీవుడ్ మార్కెట్‌ను క్రాక్ చేయడం ఎంత కష్టమైందో! గ్లోబల్ స్టార్ ఫ్రిదా పింటో ఓ సందర్భంలో చెప్పగా, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కెరీర్ తొలినాళ్లలో తన నలుపు రంగు కారణంగానే చిన్న పాత్రలకు పరిమితమైన విషయాన్ని వివరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియన్ క్రికెటర్స్ కూడా జాతి వివక్షను అనుభవించిన వాళ్లే. ఈ సమస్య చిన్నదేం కాదు, సమిష్టి పోరాటంతోనే ముగింపు పలకాల్సిన పెద్ద సమస్య కాగా, ఇప్పటికే దీనిపై పోరాడుతున్న కొందరు రియల్ హీరోలపై స్పెషల్ ఫోకస్..

racism2

పన్నెండేళ్ల వయసులో ఎవరైనా ప్రపంచం గురించి పట్టించుకోకుండా హ్యాపీగా ఆడుకుంటారు, పాఠశాలకు వెళ్తారు, శ్రద్ధగా చదువుకుంటారు. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 12 ఏళ్ల ‘కోసం’ అనే బుడ్డోడు పుట్టినప్పటి నుంచీ జాత్యహంకారంపై పోరాడుతున్నాడు. రియాలిటీ షో ‘సూపర్ డాన్స్‌’లో తన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టిన ఆ చిన్నోడు ‘చైనీస్ జైసా దిఖ్తా హై, ఐసా బోల్తే హై లోగ్’ అంటూ అదే వేదికపై తన బాధను ప్రపంచానికి తెలియజేయడంతో అనురాగ్ బసు, శిల్పాశెట్టిలు తన తోడుగా నిలిచారు. తోటివాళ్లు తనతో ఇలా ప్రవర్తించినప్పుడు ఎంతో బాధగా ఉంటుందని ‘కోసం’ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ చిన్నోడు మాత్రమే కాదు లండన్‌లో చిన్నారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. అక్కడ పదేళ్ల చిన్నారులపై జాతి వివక్ష చూపడం శోచనీయం. పసిబిడ్డలు, పిల్లలు లక్ష్యంగా వర్ణవివక్ష కొనసాగుతుండటంతో, అక్కడ మైనర్లపై కేసులు ఎక్కువగా పెరిగాయి. దీంతో పసిపిల్లలు జాత్యహంకార వివక్షకు గురికాకుండా ఉండేందుకు ఆ దేశానికి చెందిన ‘టినీ టోట్స్ ఫౌండేషన్’ మేకప్‌తో వారి ముఖాలను తెల్లగా చేస్తోంది.

చింకీ.. కరోనా వైరస్

Meiyang Chang

కొవిడ్ తర్వాత ఈశాన్య, నేపాలి ప్రజల మీద తీవ్రస్థాయిలో ‘జాత్యహంకార’ నిందలు పెరిగాయి. వాళ్లని ‘చైనీస్, చింకీ, చివరకు కరోనావైరస్’ వంటి పేర్లతో పిలుస్తూ అవమానపరుస్తున్నారు. ఈ ద్వేషపూరిత సంఘటనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, కొంతమంది ఈశాన్య విద్యార్థులు ఓ వీడియోను విడుదల చేశారు. కేవలం తమ రూపం కారణంగా జాతి వివక్షను ఎదుర్కొంటున్నామని, వైరస్‌తో లేదా పొరుగు దేశంతో తమకు సంబంధం లేదని వారు ఆ వీడియోలో వివరించారు. టెలివిజన్ హోస్ట్, సింగర్, డెంటిస్ట్ అండ్ ఇండియన్ యాక్టర్ మియాంగ్ చాంగ్ కూడా ఇలాంటి వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాడు. దీనిపై ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ.. ‘నా పేరు చాంగ్. నేను కరోనావైరస్ కాదు’ అని తెలిపాడు. ఇక తన పాటలో ‘చెహ్రా క్యా దేఖ్తే హో, దిల్ మీ ఉతార్ కర్ దేఖో నా’ అని పాడారు. జాత్యహంకారం గురించి ఎగతాళి చేయొద్దంటూ పిలుపునిచ్చారు.

బీటీఎస్‌కు తప్పలేదు..

bts korean band

ప్రపంచ ప్రఖ్యాత కొరియన్ బ్యాండ్ బీటీఎస్ కూడా రేసిజానికి గురైంది. కేవలం రూపం కారణంగా.. వారిపై ఎన్నో రకాల కామిక్స్, మీమ్స్ వెలువడ్డాయి. ప్రత్యక్షంగా కూడా వారిని చైనీస్ పేర్లతో పిలుస్తున్నారు. దీంతో బీటీఎస్ బ్యాండ్ ‘స్టాప్ఏషియన్‌హేట్’, ‘స్టాప్ఏఏపీఐహేట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘ఏషియన్లు ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడరో కూడా మమ్మల్ని అడిగారు. అటువంటి కారణంతో ద్వేషం, హింసకు గురయ్యే బాధను మనం మాటల్లో పెట్టలేము. ఏషియన్లుగానే మనకు గుర్తింపు, మేము మా సందేశాన్ని ఎలా వినిపించాలో లోతుగా ఆలోచించాం. కానీ మన స్వరం తప్పక వినిపించాలి. నీకు, నాకు, మనందరికీ గౌరవించబడే హక్కు ఉంది. మనమంతా కలిసి నిలబడుదాం’ అని బీటీఎస్ పేర్కొంది.

priyanka chopra

శిల్పాశెట్టి కూడా తన ఉచ్ఛారణతో రేసిజం ఎదుర్కొన్నట్లు చెప్పగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక తన పుస్తకంలో తన రంగు వల్ల వివిక్షకు గురైన సంఘటనలను పంచుకుంది. ‘నేను చామనఛాయలో ఉన్నందున ‘బ్రౌనీ, కర్రీ’ అని పిలిచారు. చిన్నప్పుడు ఆ మాటలు నా ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేశాయి’ అని ప్రియాంక పేర్కొంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు మాత్రమే కాదు, పారిశ్రామికవేత్త బిర్లా ఫ్యామిలీ కూడా ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జాత్యహంకార వ్యాఖ్యలకు గురైంది. ఓ హోటల్ నుంచి తమ కుటుంబాన్ని గెంటివేశారని, ఇది వారి జాత్యహంకారానికి నిదర్శనమని తెలిపారు అనన్య బిర్లా. ఇక మార్చిలో అట్లాంటాకు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్ అనే 21 ఏళ్ల వ్యక్తి.. ఆరుగురు ఆసియా మహిళలను చంపడంతో ‘స్టాప్ ఏషియన్ హేట్’ ప్రారంభమైంది. ఇలా అడుగడుగునా ఏషియన్ల మీద రేసిజం పెరిగిపోతోంది. ఇకనైనా అందరూ ఒక్కటై జాతివివక్షను ధీటుగా ఎదుర్కొవడానికి సిద్ధమవ్వాలి.



Next Story

Most Viewed