భారత్‌లో పెట్టుబడులకు దూరంగా అలీబాబా

by  |
భారత్‌లో పెట్టుబడులకు దూరంగా అలీబాబా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారత్‌లో పెట్టుబడులను పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చిన చైనా దిగ్గజం అలీబాబా (Alibaba) సంస్థ ఆ దిశగా ఆలోచనలను విరమించుకున్నట్టు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా దేశీయంగా ప్రారంభమైన అనేక స్టార్టప్ (Startup) కంపెనీల్లో అలీబాబా సంస్థ పెట్టుబడులు పెట్టిందన్న సంగతి తెలిసిందే.

అలీబాబా సంస్థ మరో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ యాంట్ గ్రూప్ సహకారంతో భారత్‌లో సుమారు 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మరికొన్ని సంస్థలకు అదనపు నిధులను కేటాయించింది. బిగ్‌బాస్కెట్, పేటీఎం, జొమాటో లాంటి సంస్థల్లో అలీబాబా కంపెనీకి వాటాలున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో అలీబాబా సంస్థ నుంచి పెట్టుబడులు తగ్గనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ రాబోయే ఆరు నెలల వరకు భారత్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలని అలీబాబా సంస్థ భావిస్తోంది. అంతేకానీ, పూర్తి స్థాయిలో భారత్ మార్కెట్ల నుంచి నిష్క్రమించడం, భారత్‌లోని కంపెనీల్లో ఉన్న వాటాలను విక్రయించడం కానీ ఉండదని తెలుస్తోంది.



Next Story

Most Viewed