ఎరువుల వాడకం తగ్గించాలి

by  |
ఎరువుల వాడకం తగ్గించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: మోతాదుకు మించి ఎరువుల వినియోగంతో నేల స్వభావం దెబ్బతింటుందని, తెగుళ్లు, పురుగుల బెడద ఎదురవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సెరికల్చర్ కార్యాలయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ సగటులో ఎకరానికి 78.4 కిలోలు, దేశసగటు 51.2కిలోలు కాగా, మనరాష్ట్ర సగటు 173కిలోలు (86.5 పోషకాలు) చొప్పున వినియోగం ఉందన్నారు. ఇటీవల వ్యవసాయశాఖ సేకరించిన మట్టి నమూనాలను పరిశీలించిన తర్వాత మన నేలల్లో పోటాష్, భాస్వరము అధికంగా ఉందని, నత్రజని కొంచెం తక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు.

శాస్త్రవేత్తలు సూచించిన మెళకువలు పాటించాలని, దీంతో అనర్ధాలను నిర్మూలించవచ్చని సూచించారు. గతేడాది ఈరోజు వరకు 79.94 లక్షల ఎకరాలు సాగుచేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు కోటీ 17లక్షల ఎకరాలు సాగైందని, ఈ వానకాలానికి తెలంగాణకు కేంద్రం నుంచి 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించారని వివరించారు. సోమవారం వరకు రాష్ట్రానికి 16.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయిందన్నారు.

గతేడాది 19.55లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారని, ఇప్పటివరకు 8.05 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశామన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో రైతాంగం నియంత్రిత సాగుకు జై కొట్టారని, వరి, కంది, పత్తి సాగుకే మొగ్గుచూపారని, వానాకాలానికి ముందు జిల్లాల వారీగా వేయాల్సిన పంటలను వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడంతో సాధ్యమైందన్నారు.

Next Story

Most Viewed