రాత్రి 7 తర్వాత బయటకొస్తే అంతే సంగతులు: సీపీ కమలాసన్ రెడ్డి

by  |

దిశ. కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గుర్తింపుకార్డు లేకుండా రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే ఇకమీదట వదిలేది లేదని కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కిలో కూరగాయలు కొనుగోలు చేసి నగరమంతా తిరిగే వారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఐడీ ప్రూఫ్ లేకుండా నగరంలో తిరిగే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం లేదా వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాత్రి 7 గంటల తర్వాత ఆస్పత్రిలో తమ వారు ఉన్నారని చెబుతూ కొందరు రోడ్లపై తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీపీ వెల్లడించారు. నిజంగా అలాంటి వారు ఎవరైనా ఉంటే కర్ఫ్యూ టైం కంటే ముందే అవసరాలను తీర్చుకుని ఆస్పత్రులకు పరిమితం కావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన కరోనా డ్యూటీ పాస్‌లను దగ్గర పెట్టుకుని వారి పిల్లలు బయట తిరుగుతున్నారని, ఇకపై వారు కనిపిస్తే చర్యలు తీసుకోక తప్పదన్నారు. జిల్లాలో కరోనా నెగెటివ్ రిపోర్టులు వస్తున్నాయని, ఎవరూ ధీమాకు రావొద్దని, మనమంతా కరోనా ముప్పు నుంచి ఇంకా బయటపడలేదన్న వాస్తవాన్ని గ్రహించాలని సీపీ కమలాసన్‌‌రెడ్డి హితవు పలికారు.

Tags: after 7 no permission, cp kamal hassan reddy, karimnagar, corona, lockdown

Next Story

Most Viewed