మసాబా బ్రాండ్‌లో 51 శాతం వాటా కొన్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్..

70
masaba

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లుగా మెరుగైన వృద్ధిని సాధిస్తున్న భారత సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ మార్కెట్‌లో పట్టును సాధించేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రయత్నిస్తోంది. తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) ప్రముఖ లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ సంస్థ హౌస్ ఆఫ్ మసాబాలో 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 12.14 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో రూ. 90 కోట్లుగా కంపెనీ తెలిపింది. భారత్‌లో ఈ రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని అనుసరిస్తూ దిగ్గజ రిటైలర్లు ఏబీఎఫ్ఆర్ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం గతేడాది కాలంలో ప్రీమియం బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నాయి.

2021, జనవరిలో లగ్జరీ వెడ్డింగ్ వేర్ బ్రాండ్ సబ్యసాచిలో ఏబీఎఫ్ఆర్ఎల్ 51 శాతం వాటాను కొనుగోలు చేయగా, రిలయన్స్ రిటైల్ డిజైనర్ బ్రాండ్ రీతు కుమార్‌కు చెందిన లేబుల్‌లో 52 శాతం వాటా సాధించింది. ఏబీఎఫ్ఆర్ఎల్ వాటా కొన్న హౌస్ ఆఫ్ మసాబా కంపెనీ 2009లో మసాబా బ్రాండ్‌తో స్థాపించబడింది. ఈ కంపెనీ బ్యూటీ ఉత్పత్తులతో పాటు వివిధ రకాల దుస్తులను విక్రయిస్తోంది. ఈ కంపెనీ రాబోయే ఐదేళ్లలో దాదాపు సుమారు రూ. 37 వేల కోట్ల వార్షిక ఆదాయాన్ని లక్ష్యంగా కలిగి ఉంది.