భయం గుప్పిట్లో ఆ ముగ్గురు అధికారులు..!

by  |
భయం గుప్పిట్లో ఆ ముగ్గురు అధికారులు..!
X

దిశ, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌ ఇటీవలే ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని అవినీతికి పాల్పడిన మిగతా అధికారులు ఆగమాగమవుతున్నారు. అదనపు కలెక్టర్‌కు ముగ్గురు తహసీల్దార్‌లు సన్నిహితంగా మెలిగే వారని, వారు డబ్బులు తీసుకోవడంలో కొత్త మార్గాలు అనుసరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వారిపైనా ఏసీబీ అధికారులు దృష్టి పెడతారో లేదో చూడాలి

‘దొరికితేనే దొంగ.. దొరక్క పోతే దొర’ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అవినీతి అధికారులు. ఇప్పటి వరకు ఎంత అవినీతికి పాల్పడినా తాము ఎవరికీ చిక్కలేదని దొరల్లాగా చలామణి అయ్యారు. తీరా వారిలో ఒకరు ఏసీబీ అధికారులకు దొరకడంతో తమ గుట్టు ఎక్కడ భయటపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ముగ్గురు తహసీల్దార్లు చేతి వాటం చూపడంలో ఆరితేరిన వారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పట్టుబడిన రోజే కొందరు తహసీల్దార్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీనిపై వారు తెలిసిన వారికి ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం.

ఔటర్ రింగ్ రోడ్డు వద్దే డీల్..

ఒక తహసీల్దార్ తన మండల పరిధిలోని విలువైన భూముల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాడని సమాచారం. అందులో అధికార పార్టీ ముఖ్య నేతలకు పెద్ద ఎత్తున ఫేవర్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో సదరు తహసీల్దార్ కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. డీల్ చేసే సమయంలో ఆయనే స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ ఒక రూట్లో హైదరాబాద్‌కు వెళ్లి ఔటర్ రింగ్ రోడ్లుపై డీల్ పూర్తి చేసుకుని మరో దారిలో తిరిగి వచ్చేస్తారని కొందరు బాధితులు చెబుతున్నారు.

సిబ్బందిని సైతం వదలరు..

మరో తహసీల్దార్ సైతం అవినీతి విషయంలో తన మార్క్ చూపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిషనల్ కలెక్టర్ అక్రమాల్లో ఇతనికి సైతం పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. బయట వాళ్లనే కాకుండా తన కార్యాలయ సిబ్బంది వద్ద సైతం అందిన కాడికి దండుకునే వారని బాధితులు వాపోతున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన మహిళకు సంబంధించిన భూ వివాదంలో తహశీల్దార్‌కు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని సమాచారం. ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమాలకు పాల్పడితే వారిపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారనే విమర్శలు సైతం వస్తున్నాయి.

అసైన్డ్ భూములకు పట్టాలు..

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ తహసీల్దార్ అసైన్డ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున చక్రం తిప్పారని సమాచారం. కోర్టు పరిధిలో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో జోక్యం చేసుకోవడంతో పాటు.. నగేష్‌తో కలిసి ముడుపులు తీసుకుని సదరు అసైన్డ్ భూములకు ఎన్‌ఓసీ ఇచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దళితుల పేరున పట్టాలు ఉన్న భూములపై వేరే వారికి పట్టాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న ఘనత ఈ తహశీల్దార్‌‌కే దక్కుతుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా వివాదాస్పద భూములు, సర్టిఫికెట్ల విషయంలోనూ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని తోటి సిబ్బందే చెబుతుండటం గమనార్హం. ఇదేంటని ప్రశ్నించినందుకు ఓ అధికారిని వేధింపులకు గురిచేశారని బాధిత అధికారి వాపోయారు.



Next Story

Most Viewed