వైఎస్సార్ ఆసరా పథకంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

by  |
వైఎస్సార్ ఆసరా పథకంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ ఆసరా ఆసరా పథకంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆసరా కాదని పచ్చి దగా అని విమర్శించారు. ఆసరా పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్‌ రెడ్డి టోకరా వేశారని ఆరోపించారు. మొదటి విడతలో 87 లక్షల మందికి ఆసరా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 78.76 లక్షల మందికి ఇచ్చిందని మిగిలిన ఎనిమిదిన్నర లక్షల మంది ఏమయ్యారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి..రూ.121 కోట్లు అదనంగా చెల్లించామని ప్రకటించడం ఓ స్కామ్ అంటూ అభివర్ణించారు. సూట్ కేస్ కంపెనీ లెక్కల్లా.. సంక్షేమం లెక్కలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము స్వాహా చేయడమే ఉద్దరించడమా అంటూ ప్రశ్నించారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే కేవలం వైఎస్సార్ ఆసరా 78లక్షల మందికే ఇవ్వడమేంటని నిలదీశారు.

సెప్టెంబరులో ఇవ్వాల్సిన వైఎస్సార్ ఆసరా అక్టోబర్ నెలలో ఇవ్వడం ఏంటన్నారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్న సీఎం జగన్ ఇప్పుడు ఒక్క విడతను పది విడతలు చేశారంటూ విరుచుకుపడ్డారు. 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మలకు రూ.3వేల సహాయం చేస్తామన్న హామీ ఏమైందని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.

Next Story

Most Viewed