గనిలో ప్రమాదం.. విషయం బయటకు రాకుండా సింగరేణి అధికారులు అలర్ట్

by  |
గనిలో ప్రమాదం.. విషయం బయటకు రాకుండా సింగరేణి అధికారులు అలర్ట్
X

దిశ, గోదావరిఖని : రామగుండం రీజియన్‌లోని సింగరేణిలో గని ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో తప్పిన భారీ ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు కొంత మంది అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని సమాచారం. రామగుండం రీజియన్ వన్ ఇంక్లైన్ మైన్‌లో శనివారం సెకండ్ షిఫ్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వన్ ఇంక్లైన్ మైన్ కార్మికులు మ్యాన్ రైడింగ్ ద్వారా గని లోపలికి వెళ్తుంటారు. అయితే అలా వెళ్లిన సమయంలో హాలర్ బ్రేక్‌లు విరిగి కార్మికుల మీదకు రావడంతో గనిలోని కార్మికులు అప్రమత్తమై తప్పించుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాలర్ డ్రైవర్ మొగిలికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో సింగరేణి ఆసుపత్రికి వెళ్తే ప్రమాదం బయట పడుతుందని గ్రహించిన కొంతమంది అధికారులు గోదావరిఖని లక్ష్మీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కార్మికుడిని పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలనడంతో తిరిగి కార్మికుడిని సింగరేణి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే మిగతా కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. కాగా, సేఫ్టీ అధికారులు ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. కార్మికుల రక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయపడిన కార్మికుడిని సింగరేణి ఆసుపత్రికి తరలించకుండా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఈ ఘటనను మసిపూసి మారేడుకాయ చేసేందుకు అధికారులు ప్రయత్నించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story