వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయండి: మన్మోహన్ సింగ్

by  |
వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయండి: మన్మోహన్ సింగ్
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ మోడీకి లేఖ రాశారు. ఎంతమందికి వ్యాక్సిన్ వేశామన్నది కాకుండా దేశంలో ఎంత శాతం మందికి టీకాలు అందాయనేది ముఖ్యమని పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మహమ్మారి తీసుకొచ్చిన సంక్షోభంతో లక్షల్లో ప్రజలు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పేదరికంలోకి వెళ్లారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణాన తమ బతుకులు సాధారణం ఎప్పుడవుతాయని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని మన్మోహన్ తెలిపారు. దేశంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ఆయన ఐదు సూచనలు చేశారు.
మన్మోహన్ లేఖలో చేసిన 5 సూచనలు :

1. వచ్చే ఆరు నెలల్లో వివిధ వ్యాక్సిన్ కంపెనీలను ఇచ్చిన ఆర్డర్లను ప్రజలకు బహిర్గతం చేయాలి. వ్యాక్సిన్లను ఎవరికి ఇవ్వాలో నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా వాటిని ఆర్డర్ ఇవ్వాలి.

2. రాష్ట్రాలకు వ్యాక్సిన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారో పారదర్శకంగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం అత్యవసర అవసరాల నిమిత్తం 10 శాతం వ్యాక్సిన్ నిల్వలను తనవద్ద ఉంచుకుని మిగతావి రాష్ట్రాలకు సరఫరా చేయాలి.

3. ఫ్రంట్‌లైన్ వర్కర్లను వర్గీకరించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలి. 45 ఏళ్లు దాటినవారికి టీకా వేసుకునే అవకాశం రాష్ట్రాలకే ఉండాలి. అలాగైతే స్కూల్ టీచర్లు, బస్సు డ్రైవర్లు, త్రిచక్ర వాహనాల డ్రైవర్లు, మున్సిపల్, పంచాయతీ సిబ్బందిని గుర్తించుకుని రాష్ట్రాలే వారికి వ్యాక్సినేషన్ అందిస్తాయి.

4. ప్రభుత్వ విధానాలు, పాలసీల వల్ల మనదేశం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉన్నాం. విశిష్టమైన మేధో సంపత్తి హక్కులను కూడా సొంతం చేసుకున్నాం. అయితే ఇది ఎక్కువ ప్రైవేట్ రంగంలో ఉంది. ఈ అత్యవసర సమయంలో ప్రభుత్వం వ్యాక్సిన్ మద్దతుదారులను ప్రోత్సహించాలి. వారికి తగినన్ని రాయితీలను ఇవ్వాలి. దాంతోపాటే నిర్బంధ లైసెన్స్ విధానాన్ని అమలుపరచాలి. లైసెన్స్ ఉంటే దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు చాలా ఉన్నాయి. ఇజ్రాయిల్ కూడా ఈ విధానాన్నే అమలుచేసింది.

5. దేశీయంగా టీకా సరఫరా సదుపాయాలు పరిమితంగా ఉన్నందున యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ యూఎస్ఎఫ్‌డీఎ వంటి విశ్వసనీయమైన సంస్థలను మన దేశంలో అనుమతించాలి. ఇలాంటి సడలింపులతో దేశానికి ఉపయోగమేనని నిపుణులు భావిస్తున్నారు.

అంతేగాక వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయడాన్ని మన్మోహన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమందికి వేశామన్నది కాకుండా దేశంలో ఎంతశాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందనేది అత్యంత కీలకమని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో అతి తక్కువ మందికి వ్యాక్సినేషన్ జరిగిందని, సరైన విధానాన్ని రూపొందించి ఆ ప్రక్రియను వేగిరం చేయాలని మన్మోహన్ సూచించారు.

Next Story