జీజీహెచ్‌లో ఏసీబీ విచారణ ముగింపు

by  |
TDP leader Atchannaidu
X

దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై ఏసీబీ అధికారులు చేస్తున్న మూడు రోజుల విచారణ ముగిసింది. ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో 151 కోట్ల అవకతవకలు జరిగాయని, టెలీ హెల్త్ సర్వీసెస్ పేరిట ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి ఉందని, అలాగే నామినేషన్ల పద్దతిలో టెండర్లు కేటాయించారంటూ ఏసీబీ ఆరోపణలు చేసింది. మందులు, పరికరాలకు వాస్తవ ధర కంటే 136 శాతం అధికధరలకు కొనుగోలు చేసినట్టు ఆరోపించిన ఏసీబీ, అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఈనెల 12న అరెస్టు చేసింది.

అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడుకి గుంటూరు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయిస్తూనే మూడు రోజుల పాటు ఏసీబీ విచారించింది. తొలి రోజు మూడు గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు, రెండో రోజు ఐదు గంటల పాటు విచారించారు. చివరిదైన మూడో రోజు రెండున్నర గంటలు విచారించారు. దీంతో మూడు రోజుల్లో సుమారు 10.30 గంటల పాటు లాయర్, వైద్యుల సమక్షంలో అచ్చెన్నని విచారించారు. ఈ మూడు రోజులూ ఈ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర గురించి పలు ప్రశ్నలు సంధించారు. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు సంబంధించిన సిఫారసు లేఖ గురించి ఆరా తీశారు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం.. తానే ఆదేశాలు ఇవ్వలేదని, మందులు, పరికరాల కొనుగోలు సమయంలో తాను మంత్రిగా లేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

తాను కేవలం తెలంగాణ తరహాలో ఏపీలో అమలు చేయడంపై అధ్యాయనం చేయాలని మాత్రమే అధికారులకు సూచించానని అన్నారు. అలాగే తాను మినిట్స్‌పై మాత్రమే సంతకం చేశానని, ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల దస్త్రం తన వద్దకు రాలేదని చెప్పుకొచ్చారు. దీంతో అచ్చెన్నాయుడు విచారణకు పూర్తిగా సహకరించడం లేదని ఏసీబీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, పైల్స్ సమస్యతో రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గాయం నుంచి కోలుకున్నప్పటికీ నడుము నొప్పి, విరేచనాలు ఆయనను బాధిస్తున్నాయని తెలుస్తోంది.

Next Story

Most Viewed