ఆ వీడియో బయటపెడుతా అని మేనేజర్‌ను బెదిరించిన యూట్యూబ్ రిపోర్టర్..

78
police

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన యూట్యూబ్ రిపోర్టర్ ను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న నిజామాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు బతుకమ్మ ఆటలతో పాటు బుల్లెట్ బండి పాటపై డ్యాన్స్‌లు చేయగా ‘ఎస్8’ యూట్యూబ్ స్టాఫ్ రిపోర్టర్ పవన్ కుమార్ సాంస్కతిక కార్యక్రమాలు వీడియోలు తీసినట్లు తెలిపారు.

అయితే ఆర్ఎంకు రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలని లేకపోతే మహిళ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల బుల్లెట్ బండి పాటతో నత్య కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆర్టీసీ ఆర్ ఏం పోలీస్‌లకు ఫిర్యాదు చేసారు. డబ్బులు ఇస్తే మీ ఉద్యోగం భద్రంగా ఉంటుందని లేకపోతే మీ ఉద్యోగం ఊడుతుందని బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడిన యూట్యూబ్ రిపోర్టర్ సరాఫ్ పవన్ కుమార్ ను 1వ టౌన్ ఎస్‌హెచ్వో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

ఆర్ఏం ఫిర్యాదు మేరకు ఇచ్చిన వాయిస్ రికార్డ్ ఆధారంగా పవన్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పవన్‌ కుమార్‌పై గతంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో దోపిడి కేసులో శిక్షను అనుభవించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో 1వ టౌన్ ఎస్ హెచ్ వో ఆంజనేయులు ఉన్నారు.