సింహాల వద్ద బంగారు రత్నాలు ఉంటాయని.. బోనులోకి దుంకేసిన యువకుడు

by  |
lion-1
X

దిశ, చార్మినార్: సింహాల దగ్గర బంగారు రత్నాలు ఉంటాయని నెహ్రూ జులాజికల్ పార్కులోని సింహాలు వద్దకు వెళ్లబోయిన యువకున్ని సకాలంలో జూ సిబ్బంది రక్షించిన ఘటన బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలలోకి వెళితే … కీసరకు చెందిన జి. సాయికుమార్ (31) తల్లి దండ్రులు ఇటీవల మృతి చెందారు. అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ ఫుట్ పాత్ ల పై నివసిస్తున్నాడు. మంగళవారం మద్యాహ్నం సాయి కుమార్ నెహ్రూ జులాజి కల్ పార్కు కు చేరుకున్నాడు. టికెట్ తీసుకుని జూలోకి వెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సింహాల ఎన్ క్లోజర్ దగ్గరకు వెళ్లాడు. ఎన్ క్లోజర్ నుంచి సింహాలు వదిలిన ప్రాంతంలోకి గోడ దూకి కొండ పైకి ఎక్కాడు. ఆఫ్రికన్ సింహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ కొండ పైన ఉన్న సాయికుమార్ కింద ఉన్న సింహం పైకి దూకడానికి ప్రయత్నం చేస్తుండగా అతన్ని చూసి సింహం కూడా గర్జించ సాగింది.

ఇదంతా గమనిస్తున్న నందర్శకులు అతన్ని వెనక్కి పోవాలని అరవసాగారు. ఇంతలోనే కొండ వెనుక పై నుంచి వచ్చిన జూ సిబ్బంది అతన్ని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయికుమార్ ను పట్టుకుని బహదూర్ పురా పోలీసులకు అప్పగించారు. సింహాల వద్ద బంగారు రత్నాలు ఉంటాయని.. అందుకే వెళ్లానని సాయికుమార్ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. సాయికుమార్ మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. బహదూర్ పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed