కుదరని సయోధ్య.. గందరగోళంగా మారిన ఎంపీ అభ్యర్థుల ఎంపిక!

by GSrikanth |
కుదరని సయోధ్య.. గందరగోళంగా మారిన ఎంపీ అభ్యర్థుల ఎంపిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ మధ్య స్వల్ప గ్యాప్ ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేలు ఒకరిని సూచిస్తుండగా, స్టేట్, సెంట్రల్ పార్టీలు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నాయి. గ్రౌండ్ లీడర్లకు, స్టేట్ నేతలకు సయోధ్య కుదరకపోవడంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకుండా అభ్యర్థిని ఎంపిక చేస్తే పార్టీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఈ నెల 18న మరోసారి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనున్నది. అదే రోజు టిక్కెట్లను ఫైనల్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలోని కేడర్ కు అనుగుణంగా క్యాండియేట్ ను సెలక్ష్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీన్ని రాష్ట్ర పార్టీతో పాటు, ఏఐసీసీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.

కేడర్ ప్రయారిటీ అవసరమే...

పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇటీవల పార్టీలో చేరిన వెంకటేష్ నేతకాని, సుగుణ కుమారి పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తుండగా, గ్రౌండ్ లెవల్ కేడర్ మాత్రం గడ్డం వంశీకే ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోన్నది. మరోవైపు రాష్ట్ర మంత్రి ఒకరు కూడా గడ్డం వంశీ అభ్యర్ధిత్వంపై అబ్జక్షన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో హైకమాండ్ ఎవరి పేరును ఎంపిక చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక సికింద్రాబాద్ లో మాజీ ప్రోఫెసర్ విద్యాస్రవంతికి టిక్కెట్ ఇవ్వాలని క్షేత్రస్థాయిలోని నేతలు కోరుతుండగా, రాష్ట్ర, ఏఐసీసీ నేతలు మాత్రం బొంతు ఫ్యామిలీపై మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన బొంతు ఫ్యామిలీకి ఇస్తే పార్టీలో విభేదాలు మొదలయ్యే ప్రమాదం ఉన్నదని క్షేత్రస్థాయి కేడర్ కీలక నేతలకు వివరించినట్లు సమాచారం.

చేవెళ్లలో పట్నం సునీత మహేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుండగా, కేడర్ మాత్రం మొదట్నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతల పేర్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు. పైగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. టిక్కెట్ హామీతోనే చేరాలని ఆయన ఆలోచన. మరోవైపు మల్కాజ్ గిరి లో మాత్రం తన ప్రభావం ఇప్పటికీ ఉన్నదని, ఆ సీటును తాను చెప్పిన వ్యక్తికే ఇవ్వాలని సీఎం రేవంత్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగురవేయడం తన లక్ష్యమని వివరించినట్లు తెలుస్తోన్నది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ని పార్టీలోకి తీసుకునేలా వ్యహాలు అమలు చేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్ తదితర పార్లమెంట్ లలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నది. కేడర్ ఒక లీడర్ ను భావిస్తే, పార్టీ హైకమాండ్ మరో పేరును తెర మీదకు తీసుకువస్తుంది.

ఈ నెల 18 న సీఈసీ..?

ఈ నెల 18న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనున్నది. ఇప్పటికే నాలుగు సెగ్మెంట్ లకు అభ్యర్ధులను ప్రకటించగా, మిగతా 13 స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. అదే రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ తోపాటు ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి, సీడబ్ల్యూసీ మెంబర్లు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొనే అవకాశం ఉన్నది. ఇటీవల గాంధీభవన్ లో దీపా దాస్ మున్షి సేకరించిన అభిప్రాయాలను ఈ సీఈసీ మీటింగ్ ముందు ఉంచనున్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా తీసుకోవాలని దీపా హైకమాండ్ కు వివరించినట్లు సమాచారం.

Next Story

Most Viewed