ఎన్డీయేకే మా మద్దతు: ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

by Dishanational5 |
ఎన్డీయేకే మా మద్దతు: ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి మిత్రపక్షమైన శివసేన పార్టీ(షిండే) చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేపై తరచూ విమర్శలు గుప్పించే ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే మంగళవారం కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌థాక్రే పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రధాని మోడీకి, ఎన్డీయే కూటమికి ఎంఎన్ఎస్ సంపూర్ణ మద్దతు పలుకుతోంది. కావునా, మన కార్యకర్తలంతా ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకూ సిద్ధంకండి’’ అంటూ పిలుపునిచ్చారు. మోడీని ఉద్దేశిస్తూ, 30ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పూర్తి మెజార్టీతో ఎన్నికయ్యారని తెలిపారు. అలాగే, నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావాలని బీజేపీ కన్నా ముందు తానే చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోడీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, ఎన్నార్సీ వంటి సాహోసపేత నిర్ణయాలను ప్రశంసించానని చెప్పుకొచ్చారు. కాగా, గత నెల 19న ఢిల్లీ వెళ్లిన రాజ్‌థాక్రే.. అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో ఎంఎన్ఎస్ పార్టీ చేరనుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. బీజేపీతోపాటు ఈ కూటమిలో శివసేన(షిండే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్)లు ఉన్నాయి. ఈ ఊహాగానాలపైనా రాజ్‌థాక్రే స్పందిస్తూ, తాను ఎవరి కింద పనిచేయనని, ఎంఎన్ఎస్‌కే చీఫ్‌గానే ఉంటానని స్పష్టం చేశారు.




Next Story

Most Viewed