BREAKING: చిత్తుగా ఓడిన హైదరాబాద్.. 2024 IPL విజేతగా కేకేఆర్

by Satheesh |
BREAKING: చిత్తుగా ఓడిన హైదరాబాద్.. 2024 IPL విజేతగా కేకేఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి టోర్నీ విజేతగా అవతరించింది. ఎస్ఆర్‌హెచ్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లో ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ బ్యాటర్స్ వెంకటేష్ అయ్యర్ (52 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ గుర్బాజ్ 39 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. త్వదారా 2024 సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను కేకేఆర్ ఎగరేసుకుపోయింది. తాజాగా టైటిల్‌తో కోల్‌కతా ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన టాపార్డర్ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేసింది. ఈ సీజన్‌లో సిక్సుల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపర్చాడు. సునామీ ఇన్నింగ్‌లతో రెచ్చిపోతున్న ఇండియన్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తెలుగు సంచలనం, బర్త్ డే బాయ్ నితీష్ రెడ్డి 10 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఒంటి చేత్తో విజయాలు అందించిన క్లాసెన్‌ కూడా కేవలం 16 రన్స్ మాత్రమే చేసి ఈ సారి జట్టును ఆదుకోలేకపోయాడు.

మార్క్రమ్ 20 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టెన్ కమిన్స్ చివర్లో 24 పరుగులు చేసి హైదరాబాద్‌ను మూడంకెల స్కోర్ దాటించాడు. కోల్‌కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికించాడు. రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ రస్సెల్ 3 వికెట్లు తీసి ఎస్ఆర్‌హె‌చ్ నడ్డి విరిచాడు. హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సాధించారు.

Next Story

Most Viewed