IPL 2023: నేడు లక్నోతో బెంగళూరు ఢీ..

by Disha Web Desk 13 |
IPL 2023: నేడు లక్నోతో బెంగళూరు ఢీ..
X

బెంగళూరు: ఐపీఎల్‌-16లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో లక్నో రెండింట నెగ్గగా.. ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఈ రెండు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ నిలకడలేమి ప్రధాన సమస్యగా ఉన్నది. అయితే, సొంతగడ్డపై జరగడం ఆర్సీబీకి కలిసిరానుంది. కోహ్లీ, డుప్లెసిస్ ఆ జట్టుకు ప్రధాన బలమే అయినప్పటికీ.. వారిని మినహాయిస్తే జట్టులో మిగతా బ్యాటర్లు రాణించకపోవడం బిగ్ మైనస్. గత రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపర్చిన మ్యాక్స్‌వెల్, దినేశ్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉన్నది.

అలాగే, యువ క్రికెటర్లు బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, డేవిడ్ విల్లే రాణించడంపై జట్టు ఆధారపడి ఉన్నది. బౌలింగ్ పరంగానూ ఆర్సీబీ మెరుగుపడాల్సి ఉన్నది. సిరాజ్, హర్షల్ పటేల్ తమ స్థాయి ప్రదర్శన చేయలేదు. ధారాళంగా పరుగులు ఇవ్వడమేకాకుండా వికెట్లు తీయలేకపోతున్నారు. నేట మ్యాచ్‌లో వీళ్లిద్దరూ కీలకంగా మారాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు, లక్నో బ్యాటింగ్ దళంలో కైల్ మేయర్స్ ఆ జట్టుకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో కెప్టన్‌‌తోపాటు కృనాల్ పాండ్యా ఫామ్ అందుకున్నట్టు కనిపించడం ఆ జట్టుకు సానుకూలంశం. షెఫర్డ్, పూరన్, స్టోయినిస్, దీపక్ హుడా కూడా ఫామ్ అందుకుంటే లక్నోకు తిరుగుండదు. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్‌వుడ్, అవేశ్‌ ఖాన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌‌తో మ్యాచ్‌కు దూరమైన వీళ్లిద్దరూ నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే లక్నోకు భారీ దెబ్బే అని చెప్పొచ్చు. కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా‌లతో స్పిన్ దళం బలంగా ఉన్నది.

Next Story

Most Viewed