IPL 2023: లక్నో, ముంబైలకు చావోరేవో‌.. నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢీ

by Vinod kumar |
IPL 2023: లక్నో, ముంబైలకు చావోరేవో‌.. నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢీ
X

చెన్నయ్: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేడు చెపాక్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్స్-2కు వెళ్లనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. ఇంత కీలకమైన మ్యాచ్‌‌తో టోర్నీలో లక్నో, ముంబై జట్ల భవితవ్యం తేలనుంది. ఈ రెండు జట్లలోనూ సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ విషయంలో మాత్రం లక్నోతో పోలిస్తే ముంబై బలంగా కనిపిస్తుంది. అయితే, వరుసగా మూడు విజయాలు సాధించడంతో లక్నో ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నారు. అలాగే, గతంలో ముంబైతో తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ లక్నోనే నెగ్గడం ఆ జట్టు ఆటగాళ్లకు మరింత బలాన్ని ఇవ్వనుంది. మరోవైపు, బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా ఉన్న ముంబై టైటిల్ దిశగా అడుగు వేసేందుకు సై అంటున్నది. మరి, కీలకమైన మ్యాచ్‌లో లక్నో, ముంబై ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.

లక్నో అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే..

లక్నో‌ బ్యాటర్లలో నిలకడలేమి వెంటాడుతున్నది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడం లక్నోకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. అయితే, గత మ్యాచ్‌లను పరిశీలిస్తే సమిష్టిగా ఆడిన దాఖలాలు చాలా తక్కువ. బ్యాటింగ్ దళంలో ఒకరో ఇద్దరో ధాటిగా ఆడటం ద్వారానే ఆ జట్టు నెట్టుకొస్తున్నది. కైల్ మేయర్స్, డికాక్ శుభారంభం అందించడం కీలకం కానుంది. అలాగే, స్టోయినిస్, పూరన్ మిడిలార్డర్ జట్టుకు బలాన్నిచ్చే ఆటగాళ్లే అయినప్పటికీ అడపాదడపా భారీ ఇన్నింగ్స్‌లు తప్ప నిలకడగా రాణించలేకపోతున్నారు. వీరిద్దరూ చెలరేగితే లక్నోకు బ్యాటింగ్‌లో తిరుగుండదు. కెప్టెన్ కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని రాణించాల్సి అవసరం ఉన్నది. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ నిలకడ ప్రదర్శన చేస్తుండగా.. నవీన్ ఉల్ హక్, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ సహకారం అందించాల్సి ఉంది. ముంబై బ్యాటర్లను అడ్డుకోవాలంటే బౌలర్లు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కీలకమైన మ్యాచ్‌లో లక్నో అసాధారణ ప్రదర్శన చేయడం ద్వారానే గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.

ముంబైకి బ్యాటింగ్ ఫ్లస్..

ప్రారంభంలో తడబడినా రోహిత్ సేన క్రమంగా లోపాలను అధిగమించుకుంటూ టోర్నీలోకి ఇక్కడి వరకూ వచ్చింది. ముంబైకి ప్రధాన బలం బ్యాటింగ్. సూర్య, గ్రీన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ గత రెండు మ్యాచ్‌లతో ఫామ్ అందుకున్నట్టు కనిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కీలక సమయంలో హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవడం ముంబైకి సానుకూలంశం. అలాగే, ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం టచ్‌లోనే ఉన్నాడు. అయితే, మిడిలార్డర్‌లో నేహాల్, టిమ్ డేవిడ్ నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తున్నది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కితే ముంబై బ్యాటింగ్ బలం పెరిగినట్టే. సీజన్ ప్రారంభంలో తిలక్ జట్టు అండగా నిలిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, ఆకాశ్, పీయూష్ చావ్లా కీలకంగా మారనున్నారు.

Next Story

Most Viewed