రోహిత్‌కు జోడీగా కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్?

by Dishanational3 |
రోహిత్‌కు జోడీగా కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ముగియగానే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. జూన్ 2 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభకానుంది. వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీ. బీసీసీఐ, సెలెక్టర్లు ఇప్పటికే భారత జట్టు ఎంపికపై దృష్టి పెట్టారు. ఐపీఎల్-17లో ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, జట్టు కూర్పు విషయంలో సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో బెంగళూరు తరపున ఓపెనర్‌గా రాణిస్తున్న విరాట్ కోహ్లీని పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ‘ఓపెనర్‌గా విరాట్‌ను ఎప్పుడూ మినహాయించలేదు. మరొక ప్లేయర్‌కు అవకాశం కల్పించడానికి వీలవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే అలా ఎందుకు చేయకూడదు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అతను రెగ్యులర్ ఓపెనర్. కాబట్టి, కోహ్లీని ఓపెనర్‌గా తీసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, నిర్ణయం టీమ్ మేనేజ్‌మెంట్‌దే.’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్‌-17లో అదరగొడుతున్న కోహ్లీ

ఐపీఎల్-17లో బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 361 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతోపాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా, టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అతనికి మంచి రికార్డే ఉంది. ఐపీఎల్‌లో 103 మ్యాచ్‌ల్లో 45 కంటే ఎక్కువ సగటుతో 3,927 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతను చేసిన 8 సెంచరీలు ఓపెనర్‌గా వచ్చి బాదినవే. టీ20ల్లో 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటుతో 400 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 161 పైగా ఉంది. టీమ్ ఇండియా కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ గణాంకాలతో పోలిస్తే టీ20ల్లో ఓపెనర్‌గా కోహ్లీ గణాంకాలే ఉత్తమంగా ఉండటం గమనార్హం.

ఆ సమస్య కూడా తీరినట్టే

టీమ్ ఇండియా తరపున కోహ్లీ సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నం.3లో బ్యాటింగ్ వస్తాడు. కానీ, ప్రస్తుతం ఐపీఎల్‌లో అతని ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఓపెనర్‌గా పంపించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో దీని గురించి చర్చించినట్టు తెలిసింది. కోహ్లీ‌ని ఓపెనర్‌గా పంపడం ద్వారా మిడిలార్డర్ సమస్యను కూడా అధిగమించొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీనిద్వారా అతని స్థానంలో మిడిలార్డర్‌లో మరొకరికి అవకాశం దక్కతుంది. అప్పుడు బ్యాటింగ్ దళం సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే 6వ బౌలింగ్ ఆప్షన్‌ కూడా జట్టుకు తోడవుతుంది.

Next Story

Most Viewed