T20 World Cup 2024 : పాక్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లకు షాక్ తప్పదా?

by Harish |
T20 World Cup 2024 : పాక్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లకు షాక్ తప్పదా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. పసికూనలు పెద్ద జట్లకు గట్టిపోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు పెద్ద జట్లు గ్రూపు దశలోనే నిష్ర్కమించే పరిస్థితి ఏర్పడింది. మాజీ చాంపియన్లు పాకిస్తాన్, శ్రీలంక జట్ల సూపర్-8 రౌండ్ ఆశలు సంక్లిష్టంలో పడ్డాయి. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ పరిస్థితి దాదాపు అంతే. మరి, ఈ జట్ల తర్వాతి రౌండ్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

పాకిస్తాన్ : గ్రూపు ఏలో ఉన్న పాకిస్తాన్ వరుసగా అమెరికా, భారత్ చేతిల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఇంకా ఖాతా తెరవని ఆ జట్టు నెట్‌రన్‌రేట్ ప్రకారం మూడో స్థానంలో ఉన్నది. పాక్ ఇంకా రెండు మ్యాచ్‌లు(కెనడా, ఐర్లాండ్‌లతో) ఆడాల్సి ఉండగా.. అందులో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ నెగ్గినా తర్వాతి రౌండ్‌కు చేరుకుంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అమెరికా నుంచి ఆ జట్టుకు గట్టి పోటీ తప్పేలా లేదు. యూఎస్‌ఏ మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అదే జరిగితే అమెరికాతో పాక్ 4 పాయింట్లతో సమంగా నిలుస్తుంది. అప్పుడు కూడా మెరుగైన నెట్‌రేట్ ఉంటేనే పాక్‌కు అవకాశాలు ఉంటాయి. భారత్, అమెరికా మరో మ్యాచ్ నెగ్గితే పాక్ ఆశలు గల్లంతైనట్టే. 2009లో పాక్ టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచింది, 2007, 2022లలో ఫైనల్‌కు చేరుకుంది.

శ్రీలంక : శ్రీలంక పరిస్థితి కూడా అదే. గ్రూపు డిలో ఉన్న లంక జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు తర్వాతి రౌండ్ అవకాశాలు సన్నగిల్లాయి. అదే గ్రూపులో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే, నెదర్లాండ్స్, నేపాల్‌తో కూడా లంక జట్టుకు పోటీ ఉంది. శ్రీలంక మిగతా రెండు మ్యాచ్‌ల్లో నేపాల్, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌ల్లో శ్రీలంక భారీ విజయాలు నమోదు చేయాలి. అలాగే, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. 2009, 2012లో ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక 2014లో టైటిల్ గెలుచుకుంది.

ఇంగ్లాండ్ : డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. గ్రూపు బిలో ఉన్న ఆ జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో సూపర్-8 రౌండ్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. స్కాట్లాండ్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణమవడం ఇంగ్లాండ్‌‌ను భారీ దెబ్బ కొట్టింది. ఆ మ్యాచ్‌లో ఫేవరెట్ అయిన ఇంగ్లాండ్‌ గెలిచి ఉంటే 2 పాయింట్లు చేరేవి. కానీ, రద్దవడంతో ఒకే పాయింట్ వచ్చింది. ప్రస్తుతం గ్రూపులో నమీబియా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసిస్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. ఇంగ్లాండ్ ముందడుగు వేయాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలవడం తప్పనిసరి. అదే సమయంలో ఆస్ట్రేలియా మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఆసిస్ తలపడేది స్కాట్లాండ్, నమీబియాలతో కావడంతో ఆ జట్టు గెలుపు ఖాయమే అని చెప్పొచ్చు. మరోవైపు, స్కాట్లాండ్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే మెరుగైన నెట్‌రేట్‌తో గ్రూపులో రెండో స్థానం దక్కించుకోవచ్చు. ఇంగ్లాండ్ ఈ నెల 13న ఒమన్‌తో, 15న నమీబియాతో తలపడనుంది.



Next Story

Most Viewed