లోయలో పడ్డ టూరిస్టు బస్సు..17 మంది యాత్రికులు మృతి

by Dishanational2 |
లోయలో పడ్డ టూరిస్టు బస్సు..17 మంది యాత్రికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావీన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టు బస్సులో లోయలో పడి 17 మంది యాత్రికులు మరణించినట్టు పోలీసులు గురువారం తెలిపారు.ఖాసిం జోఖియో గ్రామం నుంచి 70 మందికి పైగా ప్రజలు బలూచిస్థాన్‌లోని ఖజ్దూర్ జిల్లాలోని ముస్లిం సూఫీ మసీదు షా నూరానీకి ప్రార్థనలు చేసేందుకు వెళ్తుండగా..ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి గాయాలైనట్టు తెలిపారు. ఓ భారీ మూల మలుపు ప్రమాదానికి కారణమైందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సుమారు రెండు గంటల పాటు ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్ కరీం బక్ష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని కరాచీకి తరలించాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధ్వాన్నమైన రోడ్లు, భద్రతా పరమైన చర్యలు తీసుకోకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడటంతో సుమారు10 మంది మరణించారు.

Next Story

Most Viewed