హత్య కేసు చేధించిన పోలీసులు

by Sridhar Babu |
హత్య కేసు చేధించిన పోలీసులు
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో షేక్ రహీం అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు గురైనట్లు గుర్తించి విచారణ ముమ్మరం చేసిన పోలీసులు హత్యకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ లో సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చెడు వ్యసనాల వల్లే ఘాతుకం...

నర్సంపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో షేక్. రహీం (45) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్థానికంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దారంగుల ప్రవీణ్ కొన్ని ఏండ్లుగా మద్యానికి బానిసయ్యాడు. గతంలో అతనిపై చైన్ స్నాచింగ్ సహా మరో కేసు అతనిపై నమోదు అయినట్లు సీఐ తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడిన అతను ఇంటిముందు ఉంటున్న రహీం ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో తన స్నేహితులు అయిన బొంత రాజు, తాడేం పవన్, తాడం శివకుమార్ ల సహాయంతో పథకం పన్నారు.

ముందు రోజు రెక్కీ నిర్వహించారు. గత ఆదివారం అర్ధరాత్రి అనువైన సమయం చూసుకొని అతని ఇంటికి వెళ్లి అతడిని లేపారు. తెలిసిన వ్యక్తులు కావడంతో తలుపులు తీసిన రహీం ముఖంపై పిదిగుద్దులు గుద్దారు. అనంతరం అతని గొంతు నులిమి చంపి బావిలో పడవేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి ఇంటి లోపల బురద జళ్లినట్లు సీఐ తెలిపారు. అనంతరం కిరాణం షాపులో బీర్ బాటిళ్లు, మద్యం బాటిల్, సిగరెట్ బాక్సులు, రూ. వెయ్యి తీసుకుని పరారయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఖానాపురం వెళ్లే

దారిలో గల బ్రిడ్జి సమీపంలో ఉన్నారని తెలుసుకుని వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు, మద్యం సీసాలు, సిగరెట్ పెట్టెలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన నర్సంపేట ఎస్సై ప్రవీణ్, కానిస్టేబుళ్లు కత్తిరవి, కృష్ణ, జగన్ , రాఘవులు తదితరులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story