కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

by Sridhar Babu |
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
X

దిశ, జగదేవ్ పూర్ : కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కర్కపట్ల శేఖర్ అలియాస్ ఏసు (28)కు దౌలాపూర్ గ్రామానికి చెందిన ఆకారం సౌమ్య(25)తో గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం శేఖర్ తుర్కపల్లి లోని మామిడి తోటలో సూపర్ వైజర్ గా పనిచేస్తూ భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నారు.

అయితే గత సంవత్సరం నుంచి భార్య భర్తలు సంసారం విషయంలో తరచూ గొడవపడుతుండేవారు. ఈ విషయంలో శేఖర్ అత్తవారింటి వారు కలుగజేసుకొని పలుమార్లు నచ్చజెప్పారు. అయినప్పటికీ గత 15 రోజుల క్రితం దౌలాపూర్ లోని తన అత్తగారి ఇంటి వద్ద ఉన్న తన భార్యను తీసుకవచ్చిన శేఖర్ మంగళవారం సాయంత్రం తుర్కపల్లి నుంచి ఇటిక్యాల గ్రామంలో తమ పొలం వద్దకు వచ్చి గడ్డిమందు తాగారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు

108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే సౌమ్య మరణించింది. కాగా శేఖర్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదేవ్ పూర్ ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసుకొని మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed