విచారణకు హాజరైతే ఇరుక్కుపోతాం.. ప్రభాకర్ రావుపై లీడర్లు, మాజీల ఒత్తిడి!

by Disha Web Desk 2 |
విచారణకు హాజరైతే ఇరుక్కుపోతాం.. ప్రభాకర్ రావుపై లీడర్లు, మాజీల ఒత్తిడి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎంక్వయిరీ చేసిన అధికారులు, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఇప్పటివరకు అరెస్టయ్యి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ అధికారులైన ఓఎస్డీ రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్‌రావు వేర్వేరుగా ఇచ్చిన స్టేట్‌మెంట్లలో ‘చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే...’ అంటూ వారు వెల్లడించారు. కొందరి రిమాండ్ రిపోర్టుల్లో పోలీసులు ఈ అంశాన్నే పేర్కొన్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, ఎంక్వయిరీ కొలిక్కి వస్తుందని దర్యాప్తు టీం భావిస్తున్నది. కానీ, ట్యాపింగ్‌తో సంబంధమున్న లీడర్లు, మాజీల నుంచి ప్రభాకర్ రావుపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. వారితో ఇప్పటికే ఆయన టచ్‌లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కోసం అధికారుల ఎదుటకు హాజరుకావొద్దని, హాజరైతే ఇరుక్కుపోతామనే ఆయనకు వారు సూచించినట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అందులో భాగంగానే ఆయన ఇక్కడికి రావడం లేదని టాక్.

అనారోగ్యం పేరుతో విదేశాల్లో...

గతంలో ఎస్ఐబీలో పనిచేసిన ఆ ఆఫీసర్లంతా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. వీరందరికీ అప్పట్లో చీఫ్‌గా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావు మాత్రం రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి రాకుండా అనారోగ్యం పేరుతో విదేశాల్లో ఉన్నారు. అమెరికా, దుబాయ్ అంటూ రకరకాల వార్తలు వచ్చినా ఇప్పుడు ఆయన్ను రప్పించడం ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు కీలకంగా మారింది. ఇప్పటికే లుకౌట్ నోటీసు ఇచ్చినా దాంతో ఫలితం లేకుండాపోయింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పేరుతో ఫారిన్‌లో ఉన్న ఆయనను ఏ దారిలో రప్పించాలన్నది పోలీసులకు సవాలుగా మారింది. ఆయనను రప్పించడానికి ఉన్న మార్గాలపై న్యాయ నిపుణుల సలహాలు కీలకంగా మారాయి.

ప్రభాకర్ రావు వస్తే నాటి అధికార పార్టీ నేతలకు చిక్కులు!

క్రింది స్థాయి అధికారులంతా ఫోన్ ట్యాపింగ్‌పై ఇప్పటికే కొన్ని వివరాలను వెల్లడించారు. ప్రభాకర్‌రావు సైతం విచారణకు హాజరైతే వాటిని ధ్రువీకరించే తీరులోనో... లేక తిరస్కరించే విధంగానో స్టేట్‌మెంట్ ఇవ్వక తప్పదు. దీంతో అప్పటి అధికార పార్టీ నేతలకు కొన్ని చిక్కులు తప్పవనే వాదన తెరపైకి వచ్చింది. ఆయన నోరు విప్పితే అనివార్యంగా కొద్దిమంది లీడర్ల పేర్లను వెల్లడించాల్సి వస్తుందని, అది రాజకీయంగా మెడకు చుట్టుకునే ప్రమాదమున్నదనేది వారి భయం. ఈ పరిస్థితుల్లో ప్రభాకర్‌రావు తీసుకునే నిర్ణయం కీలకమవుతున్నది.

ఎలాంటి చర్యలు?

ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నందున ప్రభాకర్‌రావును ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేయడం కీలకం. కానీ ఆయనను విదేశాల నుంచి రప్పించడంలోనే అనేక సవాళ్లు ఉన్నాయనేది పోలీసుల వాదన. విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రభాకర్‌రావు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి ఒత్తిడి తీసుకురావడమా?... లేక కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరడమా?... లేదంటే ఇప్పటికే క్రిందిస్థాయి అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడమా?... ఇలాంటి అనేక సందేహాలతో ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు చిక్కులు ఏర్పడ్డాయి. ప్రభాకర్‌రావు హాజరైతే ట్యాపింగ్‌లో ప్రమేయమున్న నేతలకు ఇబ్బందులు... హాజరుకాకుంటే పోలీసులకు తలనొప్పి... ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు ఆసక్తికరంగా మారాయి.

గతంలో లీకులు

కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రభాకర్‌రావే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడడం, ఆ తర్వాత విచారణకు హాజరవుతానని లీక్‌లు ఇవ్వడంతో ఇక ఆయన విచారణకు హాజరవుతారని ఇన్వెస్టిగేషన్ టీమ్ భావించింది. ఈలోగా పలువురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం, స్టేట్‌మెంట్లను రికార్డు చేయడమూ కంప్లీట్ చేసింది. కానీ ప్రభాకర్‌రావు హాజరుకాకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ అసంపూర్ణంగా మిగిలిపోయింది. మరోవైపు కస్టడీలో ఉన్న సమయంలో రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరుల ద్వారా కూడా ప్రభాకర్‌రావును రప్పించేందుకు ఉన్న మార్గాలపై పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. ప్రభాకర్ రావు వచ్చి కొన్ని రోజులు కస్టడీలో ఉండి స్టేట్‌మెంట్ ఇస్తే ఆయనకు సగం టెన్షన్ తగ్గుతుందని, లేదంటే దర్యాప్తు కాంప్లికేట్‌గా మారి కొత్త చిక్కులు ఎదురవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు సన్నిహితుల ద్వారా ఆయనకు పోలీసులు ఆ మెసేజ్ పంపినట్టు తెలిసింది. మరి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా పోలీసులు పెంచే ఒత్తిడి పనిచేస్తుందా?... లేక ప్రమేయం ఉన్న నేతల పైరవీలు పనిచేస్తాయా? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు వెల్లడించే అంశాలు కీలకం కావడంతో పోలీసులు తీసుకుని తదుపరి నిర్ణయమే ఉత్కంఠ రేకెత్తిస్తున్నది.



Next Story

Most Viewed