ఇంటర్వ్యూకు వెళుతూ... కానరాని లోకాలకు

by Kalyani |
ఇంటర్వ్యూకు వెళుతూ... కానరాని లోకాలకు
X

దిశ, భిక్కనూరు : పొద్దంతా కష్టపడి... రాళ్లు కొట్టిన బతుకులు మాత్రం మారడం లేదు... ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్తే తప్ప మన బతుకులు మారవన్న ఉద్దేశంతో బైక్ పై ఇంటర్వ్యూ కి వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వ్యాన్ మృత్యు రూపంలో వచ్చి కబళించడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లా నిజాంపేట చెందిన తుర్క కాశీ చందా(40), కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన అబ్దుల్లా(32) తో కలిసి కులవృత్తి అయిన రాళ్లు కొట్టుకుంటూ గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. ఎంత కష్టపడి రాళ్లు కొట్టినా ప్రయోజనం లేదని భావించి గల్ఫ్ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగే ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు గ్రామం నుంచి బైక్ పై బయలుదేరి వెళ్లారు. గంభీరావుపేట సమీపంలోని పెద్దమ్మ ఆలయం స్టేజి వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో బైక్ పైన ఉన్న వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతుడు చందాకు భార్య ఫాతిమా కుమారుడు కూతురు ఉన్నారు. మరో మృతుడు అబ్దుల్లాకు భార్య జయరాంబీ, తల్లిదండ్రులు శిలార్ బి - మౌలానా, కుమారుడు కూతురు ఉన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వాహనాల్లో ఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. తొందరనే వస్తామని ఇంట్లో చెప్పి వారు, కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed