రాజస్థాన్‌లోని కోటాలో అగ్ని ప్రమాదం: 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

by samatah |
రాజస్థాన్‌లోని కోటాలో అగ్ని ప్రమాదం: 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ హాస్టల్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరగగా..ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్‌మార్క్ సిటీలో ఉదయం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కోటా పోలీస్ ఉన్నతాధికారి అమృత దుహాన్ తెలిపారు. ప్రమాదానికి గురైన హాస్టల్‌లో ఘటనా సమయంలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. విద్యార్థులు తప్పించుకునే సమయంలో తొక్కిసలాట సైతం జరిగిందని..ఈక్రమంలోనే వారికి తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించాయని అంచనా వేస్తున్నారు. మంటల నుంచి తప్పించుకోవడానికి పలువురు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకగా కాలు విరిగినట్టు సమాచారం. గాయపడిన వారంతా హాస్టల్‌లో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపారు. కాగా, కోటాలో అనేక మంది విద్యార్థులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed