ఒడ్డు పై నుంచి జారిపడి వ్యవసాయ కూలీ దుర్మరణం

by Kalyani |
ఒడ్డు పై నుంచి జారిపడి వ్యవసాయ కూలీ దుర్మరణం
X

దిశ భిక్కనూరు : ఒడ్డు పై నుంచి నడుస్తూ చెరకు తోటలో నీరు పారబెట్టేందుకు వెళుతుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో కూలీ మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన ఇటిక్యాల శ్రీనివాస్ రెడ్డి వద్ద, అదే గ్రామానికి చెందిన రాచకొండ గంగయ్య(65) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. చెరకు తోటలో నీరు పారబెట్టేందుకు వెళ్తున్నానని పటేల్ ఇంట్లో చెప్పి బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో పటేల్ కుటుంబ సభ్యులు ఆయన కోసం రాత్రంతా వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఈరోజు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పారుతున్న నీటిలో గంగయ్య మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed