గుర్తుతెలియని జంతువు దాడిలో 60 గొర్రెల మృతి

by Rajesh |
గుర్తుతెలియని జంతువు దాడిలో 60 గొర్రెల మృతి
X

దిశ, చిన్నకోడూరు : గుర్తు తెలియని జంతువులు దాడి చేసి 60 గొర్రెలను చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రైతు పున్నం మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా తన గొర్రెలను గొర్రెల షెడ్డులో వదిలి ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో వర్షం పడటంతో వడ్లు తడుస్తాయని బాయి వద్దకు పోయి వడ్లపై కప్పులు కప్పి వచ్చానన్నారు. ఆ సమయంలో ఏ సంఘటన జరగలేదన్నారు. ఉదయం నాలుగు గంటల సమయంలో గొర్రెల షెడ్డు వద్దకు పోయేసరికి గుర్తుతెలియని జంతువు మందలో నుండి పారిపోయిందన్నారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్రముద్దీన్, సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య, బీట్ ఆఫీసర్ శ్రీకాంత్‌లు చేరుకొని జంతువు కాలి గుర్తులు పరిశీలించారు.

పూర్తిస్థాయిలో కాలి గుర్తులు కనిపించడం లేదన్నారు. హైన, తోడేలు దాడి చేసి ఉండవచ్చని తెలిపారు. ఈరోజు రాత్రి పరిసర ప్రాంతాల్లో బోను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పశు వైద్యాధికారి మంజుల మాట్లాడుతూ 60 గోర్లు మరణించాయని, మరో 20 గోర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని తెలిపారు. గాయపడిన గొర్లకు చికిత్స నిర్వహిస్తున్నామన్నారు. ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి చేరుకొని బాధితునికి మనోధైర్యం కల్పించాడు. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన స్థలానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సర్పంచ్ గాజుల బాబు, ఎఫ్ పీ ఓ చైర్మన్ ఏలేటి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ పున్నం సురేష్, ఎంపీటీసీ జమున ఎల్లయ్య, గుర్రాల రాజారెడ్డి, ఏలేటి రాజిరెడ్డిలు బాధిత రైతుకు మనోధైర్యం కల్పించారు.

Next Story