రామ్ లల్లా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నా: అనిల్ కుంబ్లే

by Disha Web Desk 16 |
రామ్ లల్లా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నా: అనిల్ కుంబ్లే
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే అయోధ్యలో సందడి చేశారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రాముడి ఆలయం సమీప ప్రాంతాలను సందర్శించారు. సెల్పీలు దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ఇది ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన, దైవిక సందర్భమని చెప్పారు. రామ్ మందిరం ప్రారంభోత్సవంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రామ్ లల్లా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇక నుంచి అయోధ్యకు వస్తూనే ఉంటామని తెలిపారు. ఇంతటి అధ్యాత్మిక ఘట్టాన్ని కనులారా వీక్షించడం ఒక అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీర్వాదాలు తాము కూడా అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అనిల్ కుంబ్లే తెలిపారు.

కాగా రామమందిర ప్రారంభోత్సవం మరి కాసేపట్లో జరగనుంది. ఈ వేడుకలో భారత్, విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.

అయితే బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం కేవలం 84 సెకన్ల పాటు ఉండనుంది. మధ్యాహ్నం 12:29:03 నుంచి12:30:35 గంటల వరకు మాత్రమే శుభ సమయంగా ఉంది. ఈ 84 సెకన్లలోనే ప్రాణప్రతిష్టకు సంబంధించిన కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పండితులు దీనిని ఎంతో శుభ ముహూర్తంగా పేర్కొన్నారు. ఈ సమయాన్ని కాశీ జ్యోతిష్కుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, గిరిజన సంప్రదాయాలకు చెందిన 50 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.

Next Story