825 కేజీల గంజాయి పట్టివేత

by  |
825 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11 గంటలకు చుంచుపల్లి ఎస్ఐ అతని సిబ్బంది కలిసి తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. MH09HH 3684 అనే నెంబర్ గల లారీ అనుమానాస్పదంగా ఖమ్మం వైపు తరలి వెళుతుండగా ఆపి తనిఖీలు చేశారని చెప్పారు. లారీలో 34 బ్యాగులలో 825 కేజీల నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తదుపరి విచారణలో పట్టుబడిన వ్యక్తి మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు.

ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దినేష్ తన స్నేహితుడైన మరో నిందితుడు సునీల్ తో కలిసి గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నట్లు తెలిపారు. వారి ప్రాంతంలో నిషేధిత గంజాయిని సరఫరా చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు . ఇందులో భాగంగానే సునీల్ MH09HH 3684 అనే నంబర్ గల లారీతో తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వెళ్లి అక్కడ ఒక ఫ్యాక్టరీలో టైల్స్ ను కొనుగోలు చేసి అటువైపు నుండి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కుంట అటవీ ప్రాంతం చేరుకుని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుండి 34 బ్యాగులలో 825.100 కేజీల గంజాయిని టైల్స్ కింద అమర్చి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ ల మీదుగా గ్వాలియర్, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన నిషేధిత గంజాయి విలువ సుమారుగా 1,65,02000 రూపాయలు ఉంటుందని ఎస్పీ సునీల్ తెలిపారు.

Next Story