7H MPL ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ

by  |
7H MPL ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: నందిని టైర్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న 7H మీడియా ప్రీమియర్ లీగ్ 2021- సెకండ్ సీజన్ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7H MPL ఫౌండర్, చైర్మన్ వెంకటేశ్, లీగ్‌లో పాల్గొ్ంటున్న 16 జట్ల కెప్టెన్లు, టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, నందిని టైర్స్ ఎండీ భరత్ రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎవోలెట్‌ ప్రతినిధులు పాల్గొని ట్రోఫీ, జెర్సీలతో పాటు, మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌కు బహుమతిగా అందిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికిల్‌‌ను ప్రదర్శించారు.

టోర్నమెంట్ వివరాలు, షెడ్యూల్..

7H MPL సెకండ్ సీజన్‌లో మొత్తం 8 ఎలక్ట్రానిక్, 7 ప్రింట్‌, 1 ప్రెస్ క్లబ్‌‌ కలుపుకొని 16 జట్లు ఆడుతున్నాయి. ఇందులో దిశ, T న్యూస్, TV 9, సాక్షి, V6, మహాన్యూస్, రాజ్ న్యూస్, HMTV, 10tv, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, డెక్కన్ క్రానికల్, తెలంగాణ టుడే, ప్రెస్ క్లబ్‌ జట్లు ఉన్నాయి. ఓపెనింగ్ మ్యాచ్‌ ఫిబ్రవరి 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనుండగా.. మిగతా మ్యాచ్‌లు హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి క్రికెట్ గ్రౌండ్‌‌లో జరుగనున్నాయి. ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించేందుకు టీఆర్ఎస్ లీడర్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మైదానంలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వ తేదీ వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌కు ఎవోలెట్ సంస్థవారు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందజేయనున్నారు. దీనికితోడు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి.. టైటిల్ స్పాన్సర్ నందిని టైర్స్ ఎండీ భరత్ రెడ్డి ప్రత్యేకంగా నగదును బహుకరిస్తానని చెప్పారు.

గ్రూపుల వారీగా..

ఈ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లను 6 గ్రూపులుగా డివైడ్ చేశారు. అందులో 5 గ్రూపులు లీగ్‌ దశల్లో మ్యాచ్‌లు రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. సూపర్ సిక్స్‌లో ఉన్న జట్టుకు మాత్రం కేవలం నాకౌట్ మ్యాచ్‌ అని.. ఇందులో గెలిస్తే సెమీస్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. అయితే, లీగ్‌ దశల్లో గెలుపొందిన వారు సూపర్ సిక్స్‌ జట్టుతో తలపడాల్సి ఉంది. అనంతరం ఫైనల్ ‌ మ్యాచ్‌కు అర్హత సాధిస్తారు. గత సీజన్‌ విన్నర్‌గా నిలిచిన ఆంధ్రజ్యోతి జట్టు ఈ సారి డ్రాలో సూపర్‌ సిక్స్‌‌‌గా‌ నిలిచింది. ఇక మిగతా జట్లను ఐదు గ్రూపుల్లో మూడు జట్ల చొప్పున డివైడ్ చేశారు.

A గ్రూపు: V6, డెక్కన్ క్రానికల్, మహా న్యూస్
B గ్రూపు: వెలుగు, TV 9, రాజ్ న్యూస్
C గ్రూపు: సాక్షి, 10 tv, T న్యూస్
D గ్రూపు: నమస్తే తెలంగాణ, HMTV, ప్రెస్ క్లబ్ హైదరాబాద్
E గ్రూపు: దిశ, తెలంగాణ టుడే, NTV సంస్థలకు చెందిన జట్లు ఉన్నాయి.

అనంతరం 7H MPL ఫౌండర్, చైర్మన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. నిత్యం వార్తల సేకరణ, వార్తల విశ్లేషణలో భాగంగా పని ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు మానసిక ఉల్లాసం, శారీరక ధారుడ్యం కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులకు హాజరయ్యారని కొనియాడారు. అటువంటి వారి కోసం 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుపుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం 16 వేరు వేరు సంస్థలతో కూడిన జట్లు ఉన్నప్పటికీ అందరూ జర్నలిస్టులే అన్న భావం, క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఒక సీజన్‌ను విజయవంతం చేసుకున్నామని.. ఇక మీదట ప్రతీ సంవత్సరం కూడా 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

7H MPL ఫౌండర్ నోట ‘దిశ’ మాట:

ఎల్బీ స్టేడియంలో జరిగిన 7H MPL ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణలో ఆర్గనైజర్ వెంకటేశ్ ప్రత్యేకంగా ‘దిశ’ పత్రిక గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్న కొత్త పత్రిక దిశ అంటూ అభివర్ణించారు. కరోనా సమయంలో నూతనంగా ఆవిర్భవించిన ఈ సంస్థ రోజు రోజుకు ప్రత్యేక కథనాలతో ముందుకుసాగుతోందని తెలిపారు.

స్నేహపూర్వకంగా మెలుగుదాం: దిశ కెప్టెన్ బాలు

7H ఎంపీఎల్‌ టోర్నమెంట్‌లో దిశ జట్టును చేర్చుకోవడం ఆనందంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన వెంకటేశ్‌కు కృతజ్ఞతలు. సెకండ్ సీజన్‌లో అన్ని జట్లు ఈ సారి కప్ మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేము కూడా మా వంతుగా టోర్నీలో విజయం సాధించేందుకు కృషి చేస్తాం. అందరితో స్నేహ పూర్వకంగా కొనసాగుతూ.. మీడియా ప్రీమియర్ లీగ్‌ను ఎంజాయ్ చేస్తాం. జర్నలిస్టుల కోసం టోర్నీ నిర్వహిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్, ముందుకొచ్చిన స్పాన్సర్లకు ‘దిశ’ జట్టు తరఫున ధన్యవాదాలు.

Next Story

Most Viewed