56వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. 12వ తరగతిలో చేరిన వృద్ధుడు

58
Elderly man

దిశ, ఫీచర్స్ : చేయాలనుకున్న పని పట్ల అభిరుచి, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అనేందుకు రాజస్థాన్‌కు చెందిన వృద్ధుడు నిదర్శనంగా నిలిచాడు. కల నెరవేర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదని జాలోర్‌కు చెందిన 77 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి హుకుందాస్ వైష్ణవ్ రుజువు చేశాడు. 55 సార్లు పదో తరగతి పరీక్షలకు హాజరైన వైష్ణవ్.. 56వ ప్రయత్నంలో ఉత్తీర్ణుడై ప్రస్తుతం XII తరగతి పరీక్షలకు పేరు నమోదు చేసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా చదువు కొనసాగిస్తున్న అతని కథ స్ఫూర్తినిస్తోంది.

జాలోర్‌లోని సర్దార్‌ఘర్ గ్రామంలో 1945లో జన్మించిన హుకుందాస్.. తీఖి గ్రామంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత 1962 నుంచి పదో తరగతి పరీక్షకు హాజరవుతున్నా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక జీవితంలో టెన్త్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించలేవన్న స్నేహితుల మాటలను సవాల్‌గా స్వీకరించిన హుకుందాస్.. ఏదో ఒక రోజు తప్పకుండా పాస్ అవుతానని చాలెంజ్ చేశాడు. ఈ క్రమంలోనే గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా చేరినట్లు తెలిపాడు. ఆ తర్వాత రెగ్యులర్ స్టడీస్ విడిచిపెట్టిన హుకుందాస్.. వాలంటీర్‌గా పరీక్షలకు హాజరుకావడం ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో 2005లో ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నుంచి క్లాస్ IV ఉద్యోగిగా పదవీ విరమణ చేశాడు. కాగా 2010 వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన X తరగతి పరీక్షకు 48 సార్లు హాజరయ్యారు. ఆ తర్వాత స్టేట్ ఓపెన్ బోర్డ్ నుంచి ప్రయత్నించాడు. ఎట్టకేలకు 2019లో సెకండ్ డివిజన్‌లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. 2021-22 విద్యా సంవత్సరానికి 12వ తరగతికి నమోదు చేసుకుని ఎగ్జామ్స్‌కు హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు.