ఆర్మీ రిక్రూట్‌మెంట్ అక్రమాల కేసు.. దూకుడు మీదున్న సీబీఐ

by  |
army recruitment case
X

దిశ, వెబ్‌డెస్క్: గతనెలలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణలో స్పీడు పెంచింది. తాజాగా దీంతో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో 23 మందిపై కేసు నమోదు చేసింది. వీరిలో ఆరుగురు లెఫ్ట్‌నెంట్ కర్నల్ స్థాయి అధికారులు, 11 మంది సైనిక అధికారులు, మరో ఆరుగురు ఇతర వ్యక్తులున్నారు. దేశవ్యాప్తంగా 13 ప్రాంతాలలోని 30 చోట్ల సీబీఐ సోదాలు చేసింది.

విచారణలో భాగంగా నిందితుల నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వెల్లడించింది. సర్వీస్ సెలక్షన్ బోర్డు రిక్రూట్‌మెంట్ ద్వారా అధికారులు, ఇతర ర్యాంకులకు సంబంధించిన నియామకాల్లో పైన పేర్కొన్న నిందితులు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అభియోగాలు మోపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగిన జనరల్ డ్యూటీ పర్సనల్స్ ఎంపికలో ప్రశ్నాపత్రం లీకైనట్టు అధికారులు గుర్తించారు. అంతేగాక పలువురు అభ్యర్థుల మెడికల్ క్లియరెన్స్ కోసం నిందితులు లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.

జైపూర్, లక్నో, కైతాల్, గోరఖ్‌పూర్, విశాఖపట్నం, గువహతి, కపుర్తలా వంటి నగరాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. వారి దగ్గర లభ్యమైన పత్రాలను విశ్లేషించే పనిలో ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తముందనేది తేలాల్సి ఉంది.

Next Story