దసరా స్పెషల్.. ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

by  |
Cm KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని 4వేల స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గతేడాది కరోనా కారణంగా తక్కువ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో అధిక మొత్తంలో ప్రయాణికులు వస్తారని భావిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర నలుమూలలకు 4 వేల బస్సులను నడపనుంది.

అయితే, వీటిని అక్టోబర్ 8 నుంచి 14 వరకూ నడపనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. కాగా నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు నడవనున్నాయి. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం నుంచి కరీంనగర్ వైపు 600 బస్సులు, మహబూబాబాద్ వైపు 450 బస్సులు, నల్గొండ వైపు 450 బస్సులు, ఆదిలాబాద్ వైపు 300 బస్సులు, మెదక్ వైపు 300 బస్సులు, నిజామాబాద్ వైపు 300 బస్సులతో పాటు ఇతర ప్రాంతాలకూ బస్సులు నడపనున్నారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నగరంలో అధికంగానే ఉన్నందున పండుగకు 950 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు www.tsrtconline.in ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Next Story