ప్రపంచ యవనికపై ప్రాచీన క్రీడలు

by  |
ప్రపంచ యవనికపై ప్రాచీన క్రీడలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2021’లో దేశీయ క్రీడలకు అరుదైన గౌరవం దక్కనుంది. గట్కా(పంజాబ్‌), కలరిపయట్టు(కేరళ), మల్లకంబ(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌), థాంగ్-టా(మణిపూర్‌) వంటి భారతీయ ప్రాచీన క్రీడలను ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’లో చేర్చినట్లు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది. వీటిలో ‘మల్లకంబ’ తప్ప మిగిలినవన్నీ మార్షల్‌ ఆర్ట్స్‌ తరహా క్రీడలే కావడం, పైగా వీటిలో యోగాకు సంబంధించిన అంశాలుండటం విశేషం. కాగా యుద్ధ విద్యల్లోనూ యోగాకు సముచితం స్థానం ఉందని ఈ ప్రాచీన యుద్ధ విద్యల ద్వారా తెలుస్తుండగా.. ఒకప్పుడు భారత్‌కే పరిమితమైన ఈ క్రీడలు ఇప్పుడు విశ్వవ్యాప్తం కావడం భారతీయులుగా గర్వపడాల్సిన విషయం. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ యుద్ధ విద్యల గురించి మీరూ తెలుసుకోండి..

కలరిపయట్టు :

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా ‘కలరిపయట్టు’ను అభివర్ణిస్తారు. మలయాళంలో ‘కలరి’ అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం. ‘కలరిపయట్టు’ అంటే యుద్ధ పాఠశాలగా చెప్పొచ్చు. బాడీ, మైండ్ సమన్వయానికి ఉపయోగపడే ‘కలరి’ ట్రైనింగ్‌లో భాగంగా చట్టమ్(జంపింగ్), ఒట్టం(రన్నింగ్), మరిచిల్(సోమర్ సాల్ట్), అడి(స్ట్రైక్), ఇడి(పంచ్), తడ(డిఫెన్స్), పయట్టు(అసాల్ట్) వంటివి నేర్పిస్తారు. వీటిలో నైపుణ్యం సాధించిన తర్వాతే డాగర్స్, స్వార్డ్స్, బో అండ్ ఆరో, స్పియర్స్, మేస్(గద), వంటి ‘వెపన్స్’తో శిక్షణ అందిస్తారు. మొత్తంగా మెయ్ పయట్టు (ఫిజికల్ ట్రైనింగ్), వడి పయట్టు (స్టిక్ కంబాట్), ఆయుధ పయట్టు(వెపన్ కంబాట్), అడి తడ(హ్యాండ్ కంబాట్)లో శిక్షణ సాగుతుంది. కేరళలోని కొజికోడ్, తిరువనంతపురం, తెక్కడి, కోచి, మున్నార్‌లో గల పలు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో విదేశీయులు సైతం ‘కలరిపయట్టు’ను నేర్చుకుంటుండటం విశేషం. కాగా కేరళతో పాటు తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఈ యుద్ధ విద్యల ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక ‘కలరిపయట్టు’ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు తెరకెక్కగా, బాలీవుడ్​నటుడు విద్యుత్​జమాల్​ఈ క్రీడలో సిద్ధహస్తుడు. కాగా తెలుగులో ‘మనసారా’ సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌‌లో తెరకెక్కడం విశేషం.

గట్కా :

సిఖ్ మార్షియల్ ఆర్ట్‌గా పేరొందిన ప్రాచీన యుద్ధ విద్య ‘గట్కా’ను ప్రపంచానికి పరిచయం చేసింది పంజాబ్‌కు చెందిన సిక్కులు.14వ శతాబ్ధం నుంచి సిక్కులు దీన్ని ప్రాక్టీస్ చేస్తుండగా, మొదట్లో కత్తులతో ప్రదర్శించేవారు. అయితే బ్రిటిషర్ల కాలంలో నిషేధం విధించడంతో.. కత్తులకు బదులుగా కర్రలతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. దాంతో గట్కా ‘స్టిక్ ఫైటింగ్’గా మారింది. ఇక 2008లో ‘గట్కా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ఏర్పడిన నాటి నుంచి ‘గట్కా’ ఓ స్పోర్ట్‌గా మారిపోయింది. 2015లో పంజాబ్ ప్రభుత్వం ‘స్టేట్ స్పోర్ట్స్ పాలసీ’ జాబితాలో ఈ క్రీడను చేర్చింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్, బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ అండ్ కశ్మీర్‌ రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లోనూ గట్కా నేర్పించే అకాడమీలుండగా, కొన్ని అకాడమీల్లో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సు కూడా అందిస్తున్నారు. యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా 30 దేశాల్లో ఈ గట్కా కాంపిటీషన్స్ జరుగుతాయి.

మల్లకంబ :

ప్రస్తుతం పోల్ జిమ్నాస్టిక్స్‌కు ఆదిగా ‘మల్లకంబ’ను చెప్పుకోవచ్చు. 12 శతాబ్దానికి చెందిన ఈ ప్రాచీన కళారూపంలో తాడు లేదా పోల్ సాయంతో జిమ్నాస్టిక్, యోగా పోజ్‌లు పదర్శిస్తారు. ఏరియల్ యోగా చేయడంతో పాటు వుడెన్ పోల్స్‌కు హ్యాంగ్ అవుతూ రెజ్లింగ్ చేయడం ఈ క్రీడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ‘మల్ల’ అంటే రెజ్లింగ్, ‘కంబ’ అంటే పోల్ అని అర్థం. మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం, కంట్రోల్ చేయడమే ఇందులో ప్రధానం కాగా.. మల్లకంబ సాధన చేసేవాళ్లు తమ శరీరం మొత్తాన్ని ట్విస్ట్ అండ్ టర్న్ చేస్తారు. ఈ క్రీడ వల్ల మెంటల్ ఎబిలిటీతో పాటు బాడీ ఫిట్‌నెస్ అండ్ స్ట్రెంత్, బ్రీతింగ్ కంట్రోల్, పవర్ ఆఫ్ కాన్సట్రేషన్ పెరుగుతాయి. ప్రపంచస్థాయిలో జరిగే ఈ మల్లకంబ పోటీల్లో 15 దేశాలకు చెందిన రెజ్లర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. తొలిసారి ముంబైలో జరిగిన ‘మల్లకంబ వరల్డ్ చాంపియన్’ టైటిల్‌ను భారత క్రీడాకారులు సొంతం చేసుకోవడం విశేషం. మల్లకంబ క్రీడకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రసిద్ధి.

థాంగ్ టా :

మణిపూర్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్‌గా ప్రసిద్ధి చెందిన ‘థాంగ్ టా’ క్రీడను కత్తులు, ఈటెలు, బాకులు వంటి వివిధ ఆయుధాలతో ప్రదర్శిస్తారు. ఈ శిక్షణలో భాగంగా బ్రీతింగ్ మెథడ్స్, మెడిటేషన్స్ పాటు తాంత్రిక్ ప్రాక్టీస్, స్వార్డ్, స్పియర్ డ్యాన్సెస్, రియల్ ఫైటింగ్ టెక్నిక్స్ సాధన చేయిస్తారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్రీడను యుద్ధ సమయాల్లో తమ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రదర్శించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు బ్రిటీషర్ల కాలంలోనూ ఎంతోమంది రాజులు ‘థాంగ్ టా’ పోరాటంతోనే తమ భూభాగాన్ని కాపాడుకునేవారట. కాగా మణిపూర్ సంప్రదాయ నృత్యాలు ఈ మార్షల్ ఆర్ట్స్ నుంచే ఉద్భవించడం విశేషం.

Next Story