గ్రామీణ ప్రజలకు గుడ్‌ న్యూస్.. పల్లె దవాఖానలు వచ్చేస్తున్నాయ్

by  |
గ్రామీణ ప్రజలకు గుడ్‌ న్యూస్.. పల్లె దవాఖానలు వచ్చేస్తున్నాయ్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మెరుగైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంత వాసులకు అందజేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో క్వాలిఫైడ్ డాక్టర్లతో వైద్య చికిత్సలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని అర్బన్(జీహెచ్ఎంసీ పరిధి) ప్రాంతంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సక్సెస్ ఫుల్‌గా ప్రజలకు చికిత్స అందిస్తున్నాయి. వీటి స్పూర్తితో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ ‘పల్లె దవాఖాన’లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం జిల్లాలో 35 గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వైద్యులను తాత్కాలిక పద్ధతిన నియమించేందుకు ప్రకటన సైతం జారీ చేసింది. వైద్యుల ఎంపిక అనంతరం ఈ నెల చివరికల్లా పల్లె దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

అర్ఎంపీలే దిక్కు ..

గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ వైద్యులు ఉండరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకరు లేదా ఇద్దరు నర్సులు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆర్ఎంపీ డాక్టర్లే వీరికి దిక్కు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఒక్కోసారి వైద్యం వికటించి ప్రాణాలు కొల్పోయిన సందర్భాలు అనేకం. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారితే పల్లె వాసులు మెరుగైన వైద్యం కోసం నగరానికి పరుగులు తీస్తుంటారు. నగరంలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ దొరక్క, కార్పొరేట్ ఆసుపత్రులలో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం కేసీఆర్ పల్లె దవాఖానల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం రూ.10 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లాలో తొలి విడతగా 35 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పల్లె దవాఖానలలో క్వాలిఫైడ్ వైద్యుడితో పాటు రోగనిర్దారణ పరీక్షలు చేసేందుకు సిబ్బందిని నియమించనున్నారు. పల్లె దవాఖానలు అందుబాటులోకి వస్తే చిన్నపాటి జ్వరం వచ్చినా సొంత గ్రామాల్లోనే చక్కటి వైద్యం చేయించుకోవచ్చు. రోగాన్ని త్వరగా గుర్తించడంతో పాటు జబ్బులు కూడా సులభంగా నయం అవుతాయి. పట్టణాలకు, నగరాలకు వెళ్లే బాధలు తప్పుతాయి.

త్వరలోనే ఏర్పాటు..

జిల్లాలో 35 పల్లె దవాఖానలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పల్లెవాసులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 35 మంది క్వాలిఫైడ్ వైద్యులను నియమించనుంది. వైద్యుల నియామకానికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేశాం.

-డాక్టర్ మల్లిఖార్జున రావు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి


Next Story

Most Viewed