ఢిల్లీకి తప్పిన పెనుప్రమాదం.. అది పేలి ఉంటే..

29
ied

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పెనుప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తి వదిలివెళ్లిన బ్యాగులో 3 కేజీల ఐఈడీ బాంబును పోలీసులు గుర్తించారు. తూర్పు ఢిల్లీలోని రద్దీగా ఉండే పూల మార్కెట్లో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ బాంబు గనుక పేలి ఉంటే నష్టం పెద్ద ఎత్తున వాటిల్లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జనవరి 26 రిపబ్లిక్ వేడుకలకు ముందు కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్ని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో గల ఘాజీపూర్ మార్కెట్లో ఈ బాంబును నియంత్రించేందుకు 8 అడుగుల గొయ్యి తవ్వి నిర్వీర్యం చేశారు. దీనిని డిఫ్యూజ్ చేసేందుకు NSG సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగారు. బాంబ్ నిర్వీర్యం చేసిన సమయంలో పెద్ద శబ్దంతో కూడిన తేలికపాటి భూకంపం వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.

అయితే, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) లేదా క్రూడ్ బాంబును కలిగియున్న బ్యాగ్‌ను ఓ కస్టమర్ ఉదయం మార్కెట్లో వదిలిపెట్టి వెళ్లినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా వెల్లడించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పూలు కొనేందుకు స్కూటీపై వెళ్లిన వ్యక్తి మార్కెట్లో కలియ తిరుగుతూ చివరకు ఓ దుకాణంలో బ్యాగును వదిలివెళ్ళగా పూల విక్రేత దానిని గుర్తించి పోలీసులకు ఫోన్ చేశాడు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే అక్కడకు చేరుకుని పేలుడు పదార్థాన్ని కనుగొన్నారు. ఆ వెంటనే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు మార్కెట్‌‌ను తమ అదుపులోకి తీసుకున్నట్టు సీపీ అస్థానా స్పష్టం చేశారు. ప్రాథమిక పరీక్షలో పేలుడు పదార్థం నైట్రేట్ మరియు ఆర్‌డీఎక్స్ మిక్స్ అని తేలింది. దీని ట్రిగ్గర్ గడియారం లేదా మొబైల్ ఫోన్ కావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేశాయి.