కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 21 ఏళ్లు

by  |
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 21 ఏళ్లు
X

భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరుబాటలో నడచి సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు నల్ల అదిరెడ్డి, ఏర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్‌లు కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసి నేటికి 21 ఏళ్లు అవుతున్నది. విప్లవ పోరాటంలో వీరి సేవలు చిరస్మరణీయం. పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించనున్నారనే సమాచారంతో సరిహద్దు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

దిశ ప్రతినిధి,కరీంనగర్: అది 1999 డిసెంబర్ 2 ఆ కీకారణ్యాల్లో కావు కావు మంటున్న కాకుల గుంపులు. మరో వైపున పోలీసు స్టేషన్లలోని వైర్‌లెస్ సెట్లలో అధికారులు ఆదేశాలు. తూర్పు డివిజన్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని సమాచారం చేరవేస్తున్నారు. ఇంతకీ ఆ ఘటనలో చనిపోయిందెవరు..? ఎన్ కౌంటర్ జరిగెందెక్కడ అన్న ప్రశ్నలే అందరినోట. మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం అందని పరిస్థితి. సాయంత్రం అయింది ఎన్‌కౌంటర్ మృతుల వివరాలు మాత్రం తెలియరావడం లేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ వార్త దావనంలా వ్యాపించింది. ఎన్ కౌంటర్ మృతులు పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలనే ప్రచారం మొదలైంది. అన్నలకు పెట్టని కోటగా ఉన్న ఆ ప్రాంతంలో కీలక నేతలు ఎలా చిక్కారోనన్న ప్రశ్న కొందరిదైతే, ప్రజా సంఘాలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. చివరకు కొయ్యూరు అడవుల్లో చనిపోయిన వారు నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, శీలం నరేశ్ అలియాస్ మురళీ, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి అలియాస్ మహేశ్‌లుగా గుర్తించారు. దీంతో విప్లవ భావజాలం ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురైతే, పోలీసులు మాత్రం వార్ పై ఆదిపత్యం సాధించామని భావించారు.

బెంగుళూరు నుంచి రప్పించి మరీ..

కొయ్యూరు ఘటన పీపుల్స్ వార్ ఆవిర్బావం తర్వాత పార్టీకి తీరని నష్టాన్ని కలిగించింది. అప్పటి కేంద్ర కమిటీకి మూల స్తంభాలుగా నిలిచిన ముగ్గురు అగ్ర నేతలు చనిపోవడం వార్ దిగమింగుకోలేకపోయింది. గెరిల్లా యుద్ధం వరకు సాగిన తమ ప్రయాణం మరో అడుగు ముందుకేస్తే సమాంతర ప్రభుత్వం దశకు చేరుకోనున్న క్రమంలో అదే ప్రాంతంలో కేంద్ర కమిటీ నాయకులు ఎన్ కౌంటర్‌లో హతం కావడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పీపుల్స్ వార్ కంచుకోటగా మార్చుకున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కరీంనగర్ జిల్లా తూర్పు అడవుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌పై ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. అగ్రనేతలను బెంగుళూరులో పట్టుకొచ్చి కాల్చి చంపారనే ఆరోపించాయి.

నక్సల్బరీ తర్వాత..

నక్సల్బరీ ఉద్యమంలో సత్యం, ఆదిభట్ల కైలాసం, కృష్ణమూర్తిలు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో హతం కాగా, 1975లో జరిగిన మరో ఎదురు కాల్పుల్లో జనార్ధన్, మురళీ మోహన్, ఆనందరావు, సుధాకర్‌లు చనిపోయారు. ఈ రెండు ఘటనలు నక్సల్బరీ ఉద్యమానికి నష్టం కల్గించాయి. ఆ తర్వాత 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంంలో పీపుల్స్ వార్ ఆవిర్భావం జరిగింది. పీడబ్లూజీగా ఆవిర్భావం అయిన తర్వాత ఉత్తర తెలంగాణాలో తిరుగులేని పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో జరిగిన పలు ఎన్ కౌంటర్లు పార్టీ నిర్మాణానికి ఇబ్బందులు కలిగించాయి. కానీ కొయ్యూర్ ఎన్‌కౌంటర్ మాత్రం పీపుల్స్ వార్‌ను ఓ కుదుపు కుదిపేసింది. విప్లవ పంథాలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర కమిటీలో ముఖ్య భూమిక పోషిస్తున్న ముగ్గురు నేతలు మృత్యువాత పడటం సంచలనం కలిగించింది.

పీఎల్‌జీఏ ఆవిర్భావం..

అప్పటి వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీగా ఉన్న పార్టీ సైన్యానికి ఆదిరెడ్డి, నరేశ్, సంతోశ్‌రెడ్డిలను స్మరించుకునేందుకు ఏటా డిసెండర్ 2 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి వరకు ఉన్న పీజీఏను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) గా ప్రకటించింది. కేంద్ర కమిటీ బాధ్యులుగా వ్యవహరించిన ఆదిరెడ్డి ఆలోచనల్లోంచి గెరిల్లా సైన్యం పుట్టకొచ్చినందు వల్లే వారిని స్మరించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది.

పుష్కర కాలం తర్వాత..

2004లో పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్‌లో విలీనం అయిన తర్వాత ఉత్తర తెలంగాణలో పార్టీ ప్రాభవం క్రమక్రమంగా కోల్పోయింది. కంచుకోటకు బీటలు వారడంతో పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో సాయుధ దళాల కదలికలు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఒకప్పుడు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల కేడర్‌కు షెల్టర్ జోన్‌గా ఉన్న తూర్పు అటవీ ప్రాంతానికి చెందిన సాయధులు నేడు పొరుగు రాష్ట్ర అడవుల్లో తల దాచుకునే పరిస్థితి తయారైంది. దీంతో కొంతకాలంగా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోవడంతో సంస్మరణ వారోత్సవాల ఊసు లేకుండా పోయింది. తాజాగా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత వైభవం కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నదీ తీర అటవీ ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల కదలికలతో అట్టుడికిపోతున్నాయి. చాప కింద నీరులా మావోయిస్టులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి వారోత్సవాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు భావించాయి. ఇదే సమయంలో మావోయిస్టులు కూడా కరపత్రాలు విడుదల చేశారు. దీంతో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదీ తీరాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తుండగా గ్రామీణ ప్రాంతాలతో పాటు గొత్తి కోయల గూడెలపై పోలీసులు గట్టి నిఘా వేశారు.


Next Story