న్యూ ఇయర్ స్పెషల్.. మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండిలా ?

940

2022 రాశి ఫలాలు

2021 అర్థభాగం వరకు కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగింది. ఆ తర్వాత కొంతమేర వైరస్ వ్యాప్తి తగ్గడంతో నెమ్మదిగా పేద, సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభంలో కరోనా విజృంభించగా, ఆ తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలాయి. దీంతో ప్రజలు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంపాదించిన డబ్బుల్లో సగం ఆస్పత్రి బిల్లులకే ఖర్చయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2020 సంవత్సరం మొత్తాన్ని కరోనా కమ్మేయగా.. 2021ని ఎన్నో ఆశల మధ్య ప్రజలు వెల్‌కమ్ చెప్పారు. కానీ, ఈ ఏడాది కూడా అందరికీ నిరాశే మిగిల్చింది. సంతోషానికి దూరంగా భయానికి దగ్గరగా ప్రజలు తమ జీవితాలను గడిపారు. మరో రెండ్రోజుల్లో ప్రపంచం 2022లోకి అడుగుపెట్టనుంది. కొత్త ఏడాదిలో అయినా తమకు కలిసి వస్తుందా? అనుకున్న పనులు జరుగుతాయా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. అయితే, రాశిఫలాల ప్రకారం కొత్త సంవత్సరంలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆర్థికం, ఆరోగ్యంతో పాటు ఏ రాశి వారు సంతోషంగా లైఫ్ లీడ్ చేయనున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మేషరాశి 

(అశ్వని: చూ,చే,చో,లా: భరణి: లీ,లూ,లే,లో: కృత్తిక: ఆ)
కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి కొంచెం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 2020 ఏప్రిల్ నుంచి మేషరాశిపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. గత రెండేండ్లుగా వీరికి ధనలాభం చేకూరినా.. కొత్త ఏడాదిలో ధనలాభం ఉన్నా.. వృత్తి, ఉద్యోగాల్లో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవు. నవంబర్ నెలలో శని, గురువు కలయిక తర్వాత వచ్చే డిసెంబర్‌లో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు. వైదిక వృత్తిలో ఉన్నవారికి ఆర్థిక కష్టాలు తప్పవు. సినీరంగంలో ఉన్న వారికి ఆర్థికంగా లాభం పొందుతారు.రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. లాయర్లు మినహా డాక్టర్లు, క్రీడాకారులకు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందాలంటే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, సంహార భైరవ హోమం జరిపించుకుంటే ప్రమాదాలు తప్పి శుభం కలుగుతుంది.

వృషభం 

(కృత్తిక: ఈ,ఊ,ఏ రోహిణి: ఈ,వా,వీ,వూ మృగశిర: వే,వో)
కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి కొద్దిగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ తర్వాత గతంలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశముంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారు చిన్నపాటి శాంతిపూజలు జరిపిస్తే తప్పకుండా సత్పలితాలు కనిపిస్తాయి. దంపతుల మధ్య ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పాత్రికేయ, మీడియా రంగంలో ఉన్నవారికి యోగఫలితాలు కలుగుతాయి. అష్టమ, లాభాధిపతి అయిన గురువు సంచారం ఈ రాశిపై ఉండటంతో ఆయురారోగ్యాలు, ధనలాభం కలుగుతాయి. వీరిపై నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన అయా రంగాల్లో పనిచేసే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దోషనివారణ చేయించుకుంటే మంచి ఫలితాలను పొందుతారు.

మిధునరాశి 

(మృగశిర: కా,కీ ఆరుద్ర: కూ,ఖం, జ,ఛా పునర్వసు: కే,కో,హ)
కొత్త ఏడాది మిధునరాశి వారికి ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఏ పని ముందుకు సాగదు. 2022 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎదురుదెబ్బలు బాగా తగులుతాయి. అష్టకష్టాలు పడుతారు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు శివనామ స్మరణ చేస్తే ఆరోగ్యం, ఐశ్యర్యం, ప్రమాదాల నుంచి బయటపడతారు. ఈ రాశి వారిపై శనిప్రభావం తీవ్రంగా ఉంటుంది. మిధునరాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్నా ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. అపవాదుల పాలవ్వడం, దోషిగా తేలే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి 

(పునర్వసు: హీ పుష్యమి: హు,హే,హో,డా ఆశ్లేష: డీ, డూ,డే,డో)
కొత్త ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మే నెల నుంచి ఆరునెలల కాలం వరకు ఈ రాశి వారికి అష్టమశని నడుస్తుంది. దీంతో వీరు కూడా మిధున రాశి వలే అష్టకష్టాలు పడుతారు. ఆర్థికంగా నష్టపోతారు. ఏ రంగంలో పనిచేసే వారు అయినా తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. గృహ నిర్మాణ రంగం, షేర్ మార్కెట్‌లో తీవ్రంగా నష్టపోతారు. ఆరోగ్య దుష్పలితాలు కలుగుతాయి. మీ ప్రమేయం లేకపోయినా మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వారు ఇబ్బందులు పడతారు. అందుకోసం సంపూర్ణ ఆదిత్యాది నవగ్రహ శాంతి చేసుకుంటే వీరికి కొంత శుభం కలుగవచ్చు. ఆర్థికం, ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

సింహరాశి

(మఖ: మా, మి, మూ,మే పూర్వ ఫల్గుణి: మో, టా, టీ, టూ ఉత్తర ఫల్గుణి : టే)
ఈ రాశి వారు ఆర్థికంగా ప్రగతి పొందుతారు. శుభకార్యాలు కలుగుతాయి. అష్టమస్థానం నుంచి శని తప్పుకుంటాడు. దీంతో సింహరాశి వారు చదువు, పెళ్లి విషయంలో శుభవార్త వింటారు. అయితే, సాఫ్ట్‌వేర్ రంగంపై ఆధారపడిన వారికి ప్రతికూల ఫలితాలు కనిపించనున్నాయి. ఉద్యోగాలు పోయే చాన్స్ ఉంది. అయితే, ఉద్యోగ భద్రత కోసం సుబ్రహ్మణ్యస్వామి కార్తీకేయ కవచం లేదా భుజంగ స్తోత్రాన్ని పటిస్తే అవరోధాలు తొలగిపోతాయి. సినిమారంగం, డాక్టర్లు, లాయర్లకు ఎనలేని కీర్తితో పాటు ధనలాభం కూడా కలుగుతుంది.

కన్యరాశి 

(ఉత్తర ఫల్గుణి: టో, పా, పీ, హస్త: పూ, షం, ణా, ఢా చిత్త: పే, పో)
ఈ రాశి వారు గత రెండేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఏ పనులు పూర్తికాక తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. ఈ రాశి వారిపై శని దృష్టి తీవ్రంగా ఉంది. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మాత్రం వీరి జాతకం అద్భుతంగా ఉంటుంది. జ్యోతి లాగా వెలిగిపోతుంది. 2022 ఏప్రిల్ వరకు అనగా నాలుగు నెలలు మాత్రం ఇన్నిరోజులు పడిన ఇబ్బందుల కంటే మరింత నలిగిపోతారు. ఆ తర్వాత కన్యరాశి వారిపై శని దృష్టి మరలుతుంది. ఆర్థికంగా ఫిట్‌గా ఉంటారు. అనుకున్న పనులు జరుగుతాయి.కొత్త కొత్త ఆలోచనలతో జీవితంలో దూసుకుపోతుంటారు. అయితే, ఈ నాలుగు నెలల కాలంలో ఇబ్బందులు తొలగిపోయేలా శివనామస్మరణ చేస్తే కొద్దిగా మనశ్శాంతి పొందుతారు. ఒత్తిడి దూరమవుతుంది. ఫ్యామిలీలో సంతోషం నిండి, అవివాహితులకు వివాహం జరుగుతుంది. ఈ రాశి వారిపై గురు ప్రభావం పెరగడంతో ఏప్రిల్ తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

తులారాశి

( చిత్త : రా,రి స్వాతి: రూ, రే, రో, లా విశాఖ: తీ, తూ, తే)
కొత్త ఏడాదిలో ఈ రాశివారు శుభవార్త వింటారు. శనిదృష్టి తొలగిపోయి గురువు ఎంటర్ కానున్నాడు. రానున్న రెండున్నర సంవత్సరాలు వీరికి అనుకున్నదల్లా జరుగుతుంది. చదువు, వివాహం, ధనలాభం, ఆరోగ్యం, సంతానం ఇలా అన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు. కన్యరాశి వారి వలే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.. ఆ తర్వాత తులారాశి వారు ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. వీరు కూడా ఈ నాలుగు నెలల కాలం పరమేశ్వరుడిని పూజిస్తే బ్యాట్ టైం వెళ్లిపోయి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది.

వృశ్చిక రాశి

(విశాఖ: తో, అనూరాధ: నా, నీ, నూ,నే జ్యేష్ట: నో, యా, యీ,యూ)
కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు, ఆస్తి విషయాల్లో అంత త్వరగా ఫలితాలు రావు. వివాదాలు, చికాకులు వెంటాడుతాయి. పెళ్లి కావడం లేదని బాధపడేవారికి ఓ పరిష్కారం లభించవచ్చును. అందుకోసం ఈశ్వరుడిని పూజిస్తే వృశ్చికరాశి వారికి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అయితే, వ్యాపారులకు కొంత అనుకూలంగా ఉన్నా.. లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతారు.

ధనుస్సు రాశి

(మూల: యే, యో, బా, బీ పూర్వాషాడ: బూ, ధా, భా, ఢా ఉత్తరాషాడ: బే)
కొత్త ఏడాదిలో ధనుస్సు రాశికి ఎదురుదెబ్బలు తగలడం తప్పుతాయి. గత రెండేళ్లుగా ఉన్న ఇబ్బందులు కొంత తొలగిపోతాయి. గృహనిర్మాణ పనులు కష్టంగా గట్టెక్కుతాయి. ధనలాభం ఉన్నా చేతిలో ఉండదు. 2022 మధ్యమ కాలంలో చేతిలో ధనం లేకుండా పనులు మాత్రం పూర్తవుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. అయితే, ధనస్సు రాశి వారు పిల్లల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చికాకు పడుతుంటారు. మోసగాళ్ల బారిన పడి ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరులతో, ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.అందుకోసం ఈ రాశి వారు శని నివారణ జ్యోతి వెలిగించి ఈశ్వరుడికి గోవు పాలతో అభిషేకం చేయిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామంతో కూడా కష్టాల నుంచి బయటపడే ఆస్కారం ఉంది.

మకరరాశి 

(ఉత్తరాషాడ: బో, జా, జీ, శ్రవణం: జూ,జే, జో, ఖా, ధనిష్ట: గా, గీ)
ఈ రాశి వారి కొత్త ఏడాదిలో ప్రతికూల ఫలితాలను చూస్తారు. కుటుంబంలో అప్పులు, వివాదాలు, గొడవలు, ఇంటి పెద్ద అనారోగ్యం పాలవ్వడం వంటి వార్తలు వింటారు. ఫ్యామిలీ లేదా భార్యభర్తల మధ్య తీసుకునే నిర్ణయాలతో ఎదురు దెబ్బలు కలుగొచ్చు. అవివాహితులకు పెళ్లి విషయంలో చికాకు కలుగుతుంది. మిత్రులతో, బంధువులతో గొడవలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా కొంత మెరుగ్గానే ఉంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. 2022 జనవరి నుంచి ఏప్రిల్ లేదా మే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వీరు మంచి ఫలితాలను చూస్తారు. ఈ రాశి వారు కనకదుర్గ అమ్మవారు, హనుమాన్, సుబ్రహ్మణ్యస్మామిని ఆరాధిస్తే వీరిపై చెడు ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

కుంభరాశి 

(ధనిష్ట: గూ,గే శతభిషం: గో, సా, సీ, సూ పూర్వాభద్ర: సే, సో, దా)
ఈ రాశి వారు కొత్త ఏడాది జనవరి తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. పెండింగ్ పనులు జనవరిలోపు పూర్తవచ్చు. రుణ, వ్యాపారాభివృద్ధి ప్రయత్నాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వీరిపై జన్మ శని ప్రభావంతో పాటు రాహువు ప్రభావం కూడా ఉంటుంది. ఆర్థిక కష్టాలను ఇతరుల సాయంతో నెట్టుకొస్తారు. ఇతరులకు డబ్బులు ఇచ్చే విషయంలో చాలా కేర్ ఫుల్‌గా ఉండాలి. శని సంచారం చేత కుంభరాశి వారు ఇతరులకు మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేని యెడల పరువుభంగం కలుగుతుంది. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. మంగళవారం, శనివారం కొన్ని శాంతులు జరిపించుకుంటే కష్టాల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. శివస్మరణ వీరికి లాభిస్తుంది.

మీనరాశి

(పూర్వా బాధ్ర: దీ, ఉత్తరా బాధ్ర: ధు,శ్చం, చా, ధా రేవతి: దే, దో, చా,చీ)
కొత్త ఏడాదిలో మీనరాశి వారికి ఏప్రిల్ నెల వరకు ఇబ్బందులు తప్పవు. ఆ తర్వాత కొత్త ఉద్యోగం, ఉన్న వృత్తిలో హోదా పెరగడం, వ్యాపారంలో లాభాలు, ఆకస్మిక ధనలాభం, చిరకాల వాంఛలు ఏమైనా ఉంటే వాటి కోసం అడుగులు ముందు పడతాయి. అయితే, స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బెస్ట్ ఫ్రెండ్స్ చేతిలో మోసపోవచ్చు. భార్యభర్తల మధ్య, లవర్స్ మధ్య గ్యాప్ పెంచేలా మూడో వ్యక్తి ప్రమేయం ఉండవచ్చు. సినీ, పాత్రికేయ, మీడియా, రవాణా, రైతులు వీరికి రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అవివాహితులకు పెళ్లి విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా మీ బంధువులే వాటిని చెడగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంట్లో గృహిణులు కొంత ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజనిర్దారణ లేకుండా ఏ విషయంలోను త్వరగా స్పందించరాదు. దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి, కాలభైరవ స్వామిని ఆరాధిస్తే సకల సమస్యల నుంచి బయటపడుతారు.

= కొత్తపల్లి సురేశ్ శర్మ,
9640333368,9640333346