ఇవి 2020 కంటే ఎంత భయంకరమైనవో తెలుసా..?

by  |
ఇవి 2020 కంటే ఎంత భయంకరమైనవో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: 2020వ సంవత్సరం దారుణంగా నడిచిందని, వేసుకున్న ప్రణాళికలను నాశనం చేసిందని, ప్రపంచం మొత్తాన్ని బాధలు, ఇబ్బందులు పడేలా చేసిందని అందరూ తిడుతూనే ఉన్నారు. కరోనా పాండమిక్, ఆస్ట్రేలియా బుష్‌ఫైర్, బీరూట్ పేలుడు..ఇలా ఆర్థిక, సామాజిక, పారిశ్రామి, విద్య, వైద్య రంగాలను 2020 దారుణంగా ప్రభావితం చేసింది. మానవ చరిత్రలో ఇంత దారుణంగా ఒక ఏడాది గడవడం ఇదే మొదటిసారి అని అంటున్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ, వాళ్లు అనేది అక్షరాలా తప్పు. 2020 సమయాన్ని వాళ్లు దగ్గరుండి అనుభవించారు కాబట్టి ఇదే దారుణంగా గడిచిన సంవత్సరం అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఇంతకంటే దుర్భరంగా గడిచిన ఏడాదులు ఎన్నో ఉన్నాయి. మనం వాటి గురించి తెలుసుకుంటే 2020ని తప్పుగా అంచనా వేసే పరిస్థితి ఉండదు. అవేంటో ఒక్కసారి చూద్దాం..

1. క్రీ.పూ.536

మానవ చరిత్రలో దుర్భరంగా సాగిన జీవితాలకు పునాది వేసిన సంవత్సరం ఇది. ఈ ఏడాదిలో యూరప్, మెసొపొటోమియా, చైనా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలవడంతో దాని నుంచి వచ్చిన ధూళి కారణంగా ఆ చుట్టుపక్కల నివసించే వాళ్లు 18 నెలల పాటు సూర్యుడిని చూడలేదు. మండు వేసవిలో కూడా దారుణమైన చలి పెట్టింది. యూరప్, ఆసియాలను కమ్మేసిన ఆ పొగల వల్ల అత్యంత చల్లని సంవత్సరంగా రికార్డుకెక్కింది. ఐర్లాండ్, స్కాండినేవియా, చైనాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇది కాదన్నట్లు ఆ ఏడాది ముగిసేనాటికి మరొక అగ్నిపర్వతం బద్దలై పరిస్థితి ఇంకా విషమంగా మార్చింది. వీటికి తోడు మధ్యదరా ప్రాంతంలో చెలరేగిన ప్లేగు వ్యాధి 35 నుంచి 55 శాతం జనాభాను మట్టుబెట్టింది.

2.క్రీ.శ.1316

ఏడాది మొత్తం వర్షమే పడింది. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా వేసవిలో, శిశిర కాలంలో కూడా జనాలు తడిసి ముద్దయ్యారు. ముఖ్యంగా యూరప్‌లోని ఇంగ్లాండ్ దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పంటలు పండక ఆకలితో చచ్చిపోయారు. కొందరు ఆకలి తట్టుకోలేక తమ కుటుంబ సభ్యులను చంపి తినడం మొదలుపెట్టారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమై విచ్చలవిడిగా తిరిగారు. ఈ కాలంలో జరిగిన ఘటనలే హాన్సెల్ అండ్ గ్రెటెల్ కథలకు మూలం. ఈ కాలంలో పది నుంచి ఇరవై శాతం జనాభా అంతరించిపోయింది. నెమ్మదిగా 1317 వేసవి కాలం నాటికి కాని పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు.

3.1347

‘ద బ్లాక్ డెత్’ అని పిలిచే ఘటన జరిగింది ఈ సంవత్సరమే. నల్ల సముద్రం నుంచి 12 పడవలు వచ్చి సిసిలీలోని మెసినా ఓడరేవు వద్ద ఆగాయి. అందులో ఉన్న వాళ్లందరూ దాదాపు చనిపోయారు. కొద్దో గొప్పో బతికి ఉన్నవారి శరీరం మీద రక్తం కారుతూ, పసతో ఉన్న నల్లటి కురుపు ఉన్నాయి. ఇవి ప్లేగు వ్యాధి లక్షణాలు. అక్కడ రగుస ఓడరేవు అధికారులు పడవల ద్వారా వచ్చిన వారిని ఐసొలేట్ చేసి, సామాజిక దూరం పాటించడం వల్ల ఈ జబ్బు వ్యాప్తిని తగ్గించగలిగారు. అయినప్పటికీ 60 శాతం యురోపియన్‌లు ఈ జబ్బు బారిన పడి ప్రాణాలు వదిలారు. యూరప్‌తో ఆసియాలోని కొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

4. 1492

ఈ కాలంలో ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలను గడ్డు పరిస్థితులను అనుభవించాయి. క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా జాడ కనిపెట్టాడు. అలా కనిపెట్టి పాత ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నింటినీ అక్కడి కొత్త ప్రపంచానికి అంటించాడు. దీంతో ఆయా వ్యాధులకు సరైన వ్యాధినిరోధక శక్తి లేని స్థానిక ప్రజలందరూ మిలియన్ల సంఖ్యలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. స్మాల్ పాక్స్, మీజిల్స్, ఇన్‌ఫ్లూయెంజా, బుబోనిక్ ప్లేగు, డిప్తీరియా లాంటి 30 రకాల జబ్బుల వల్ల 95 శాతం మంది స్థానిక ప్రజలు చనిపోయినట్లు చరిత్ర చెబుతోంది. మరోవైపు ఇంగ్లాండ్‌లో కేథలిక్ మోనార్క్‌లు ఫెర్డినాండ్, ఇసబెల్లా కలిసి మూరిష్ గ్రనాడాను చేజిక్కించుకునే క్రమంలో 5 లక్షల మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.

5. 1520

దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాలు ఈ కాలంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. స్పెయిన్‌ నుంచి హెర్నన్ కోర్టే బలగాల ద్వారా అమెరికాలోకి స్మాల్ పాక్స్ వ్యాధి ప్రవేశించింది. యురోపియన్‌లు రాక మునుపు ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని కూడా అమెరికన్‌లకు తెలియదు. దీంతో అక్కడ అప్పటికే ఉన్న అజ్‌టెక్ నాగరికతకు చెందిన 16 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 90 శాతం మంది అజ్‌టెక్‌లు చనిపోయారు. దక్షిణ అమెరికాలో ఉన్న ఇన్‌కా నాగరికత ప్రజలు కూడా స్మాల్ పాక్స్ వల్ల చనిపోయారు.

6. 1601

పెరూలో హుయనాపుటినా అగ్నిపర్వతం బద్దలవడంతో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, రష్యా, జపాన్, చైనా, కొరియా దేశాల ప్రజలకు చాలా కాలం పాటు సూర్యరశ్మి కొరవడింది. రష్యాలో ఏకంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 మిలియన్‌ల మంది ఆకలితో చనిపోయారు. మాస్కోలో ఒకేసారి 1,27,000 మందిని ఖననం చేసి దారుణమైన సంవత్సరంగా 1601 నిలిచింది.

7. 1783

1783లో ఐస్‌లాండ్‌లోని లాకీ అగ్నిపర్వతం పేలడంతో ఉత్తరార్థ గోళం మొత్తం ప్రభావితమైంది. ఈ పేలుడు ద్వారా విడుదలైన సల్ఫర్ డై ఆక్సైడ్ కారణంగా రుతుపవనాలు రాకపోవడంతో భారతదేశంలో చాలిసా కరువు వచ్చింది. ఈ కారణంగా ఢిల్లీలోని గ్రామాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాలు విడిచారు. ఏకంగా 11 మిలియన్ల మంది వరకు ఆకలితో చనిపోయారు.

8. 1919

ఈ ఏడాదిలో అమెరికా, యూరప్, రష్యా ప్రభావితమయ్యాయి. మిలియన్‌ల మంది ప్రజలు స్పానిష్ ఫ్లూ ద్వారా చనిపోతుంటే మరో వైపు వర్సెయిల్స్ సంధి, హిట్లర్ పురోగమనం లాంటి సామాజిక కారణాలు రెండో ప్రపంచ యుద్ధానికి పునాదులు పడ్డాయి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మార్పులకు గురైన భౌగోళిక పటం వల్ల చిన్న చిన్న యుద్ధాలు జరిగి ఎంతో మంది దారుణంగా ఇబ్బందులు పడ్డారు. ఇక రష్యాలో సివిల్ వార్ వల్ల కూడా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

9. 1943

దారుణమైన రెండో ప్రపంచ యుద్ధ గడ్డు పరిస్థితులు. అసలు అప్పట్లో ఉన్నవాళ్లు ఎలా భరించారో తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచేస్తుంది. నాజీల మారణకాండ, యూదుల వలసల కారణంగా 1.2 మిలియన్ల మంది కష్టాల పాలయ్యారు. ఇక భారతదేశంలోని బెంగాల్‌లో ఘోరమైన కరువుతో 3 మిలియన్ల మంది ఆకలితో చనిపోయారు. అలాగే అమెరికాలో వర్ణవివక్ష గురించి జరిగిన విధ్వంసం వల్ల కూడా ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు.

వీటన్నిటితో పోల్చుకుంటే 2020వ సంవత్సరం కొంచెం మెరుగైందనే అనుకోవచ్చు. కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1.58 మిలియన్ల మంది చనిపోయారు. ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతోంది. అయినప్పటికీ 2020 దారుణమైన సంవత్సరం కాదు మెరుగైనదే అంటున్నారేంటి అనే అనుమానం మీకు రావొచ్చు. మీ డౌట్ కరక్టే.. కానీ, అప్పట్లో ఇంత సమాచారం లేదు కాబట్టి ఆయా సంవత్సరాల్లో జరిగిన మరణాలు, ప్రభావితమైన ప్రజల లెక్కలు కేవలం ఒక అంచనాలు మాత్రమే. అంచనాలు కాకుండా అప్పటి నిజజీవితాలను పరిగణనలోకి తీసుకుంటే అవి మరి ఇంకెంత దారుణమైన సంవత్సరాలుగా మారేవో మరి! అందుకే ఇప్పుడు ఎలాగూ పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి 2020 సంవత్సరాన్ని తిట్టడం మానేసి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.



Next Story

Most Viewed