దేశంలో కరోనా విలయతాండవం.. 239 రోజుల తర్వాత రికార్డ్..

32
corona

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచీ ప్రతిరోజూ అత్యధిక కేసులు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఒక్కరోజే 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ బారినపడి 315 మంది ప్రాణాలు కోల్పోయారు. 239రోజుల(మే 19న 2.76లక్షల కేసులు) తర్వాత తాజాగా నమోదైన కేసులే అత్యధికం కావడం వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కి చేరగా, మరణాల సంఖ్య 4,85,350కి పెరిగింది. ఇదే సమయంలో క్రియాశీలక కేసులు 12,72,073కు చేరాయి. మరోవైపు, కొత్తగా 265 మందికి ఒమిక్రాన్ సోకగా, ఇప్పటివరకు వెలుగుచూసిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు పెరిగింది. కరోనా ఉధృతి కారణంగా రోజువారీ పాజిటివిటీ రేటు 14.78కి చేరగా, వీక్లీ పాజిటివిటీ రేటు 11.83కు పెరిగింది.

రాజధానుల్లోనే విజృంభణ..

రాష్ట్రాల్లో నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచే వస్తుండటం గమనార్హం. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి క్యాపిటల్ సిటీల్లో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 238 ఒమిక్రాన్ కేసులు సహా 43,211 కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతిచెందారు. తాజా, కేసుల్లో రాష్ట్ర రాజధాని ముంబై నుంచే అత్యధికంగా 11,317 వెలుగుచూశాయి. 9మంది మరణాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో కర్ణాటకలో కొత్తగా 28,723 మంది వైరస్ బారినపడగా, 14 మంది మృతిచెందారు. వీటిలో కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచే 70శాతానికి పైగా(20,121) కేసులు, 7మరణాలు నమోదవడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 22,645 కేసులు, 28మరణాలు వెలుగు చూడగా, దీని రాజధాని కోల్‌కతాలోనే 6,867 కేసులు వెలుగుచూశాయి.

‘మృతుల్లో 75శాతం మంది టీకా తీసుకోనివారే’..

దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారిలో 75శాతం మంది టీకా తీసుకోనివారే ఉన్నారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంధర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న గడువులోగా రెండో డోసూ తీసుకోవాలని చెప్పారు. అధికారిక డేటా ప్రకారం, ఈ నెల 9నుంచి 12 వరకు వైరస్ సోకి 97మంది మృతిచెందగా, వీరిలో 70మంది టీకాలు తీసుకోలేదు. 19 మంది తొలి డోసు మాత్రమే తీసుకుని ఉన్నారు. మరో 8మంది రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ మృతిచెందారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో శుక్రవారం ఒక్కరోజే 24,383 కేసులు నమోదవ్వగా, 34 మరణాలు సంభవించాయి. రోజువారి పాజిటివిటీ రేటు 30.64శాతానికి చేరడం ఆందోళనకరం.