తొలితరం నక్సలైట్ నేత ఇకలేరు..

by  |
kolluri chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్ : తొలితరం నక్సలైట్ నేత డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఈయన కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే తోటి విద్యార్థులను కూడగట్టి 1969 ‘జై తెలంగాణ’ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1970లో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య ప్రధాన అనుచరునిగా పనిచేసారు. నాగపూర్ కుట్ర కేసులో అరెస్టై జైలుకెళ్లారు.

ఆ తర్వాత మలి దశ ఉద్యమంలోనూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన గొంతుక వినిపించారు. కొల్లూరి చిరంజీవి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పందించారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎంతో పాటు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, పలువురు ప్రముఖులు కూడా కొల్లూరి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.



Next Story

Most Viewed