సెక్రటరీలపై ప్రెజర్.. 176 మంది రాజీనామా

by  |
సెక్రటరీలపై ప్రెజర్.. 176 మంది రాజీనామా
X

దిశ, మహబూబ్‌నగర్: దినదినగండం నూరేళ్ల ఆయువు అన్నట్లుగా మారింది పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. సెక్రెటరీలపై ప్రభుత్వం ఇటీవల మోయలేని భారం మోపడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు మెడ మీద కత్తిలా మారాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 176 మంది కార్యదర్శులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ వంటి పనులు పర్యవేక్షించడంతో పని గంటలు పెరిగాయని వాపోతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్యదర్శుల పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ప్రభుత్వ టార్గెట్లు పూర్తి చేయలేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రభుత్వం నుంచి షోకాజు నోటీసులు అందుతున్నాయి. పనులు ఇన్ టైంలో పూర్తి చేయకపోవే సస్పెన్షన్ వేటు పడుతున్నది. కొత్తగా వచ్చిన ఉపాధి హామీ పనులతో ప్రెజర్ మరీ ఎక్కవ అవుతున్నదని సెక్రటరీలు వాపోతున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 176 మంది జాబ్‌కు రిజైన్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెరుగుతున్న పనిభారం

గతంలో కంటే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై పనిభారం ఎక్కువగా ఉంటున్నది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే అదనపు భారం మోస్తున్న కార్యదర్శులకు ప్రభుత్వం మరో కొన్ని బాధ్యతలు అప్పగించింది. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పర్యవేక్షిస్తున్న ఫిల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఇటీవల తొలగించింది. దీంతో ప్రభుత్వం ఉపాధీ హామీ బాధ్యతలను కూడా సెక్రటరీలపై మోపింది. ఇప్పటికే హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్న సెక్రటరీలు పెరిగిన బాధ్యతలతో సతమతం అవుతున్నారు. ఉపాధి పనుల నిర్వహణపై ఇటీవల శిక్షణ కూడా ఇవ్వడంతో వీరే పూర్తి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని అర్థం అవుతున్నది.

12 గంటల డ్యూటీ..?

ప్రభుత్వం అప్పగించిన అదనపు బాధ్యతలతో కార్యదర్శుల పని గంటలు పెరిగాయి. 8 గంటలు పని చేయాల్సి ఉండగా ఏకంగా 12గంటలు పని చేయించుకుంటున్నారని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు కుటుంబంతో సమయం కూడా గడిపే పరిస్థితి లేకుండా పోతున్నదని వాపోతున్నారు. ఉదయం నుంచి చేసే పనులతో పాటు రాత్రి సమయాల్లో కూడా పనులకు సంబంధించి నివేదికలు తయారు చేయడంలో తలమునకలు అవుతున్నామని వాపోతున్నారు. పెరిగిన పని భారంతో తీవ్ర మనసిక ఒత్తిడికి గురికావడంతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుత పనులు ఇలా

ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచే పంచాయతీ కార్యదర్శుల పని మొదలవుతున్నది. మొదట పారిశుధ్య కార్యక్రమాల పరిశీలనతో తమ విధులు మొదలవుతాయని, అక్కడి నుంచి హరితహారం కింద నాటిన మొక్కల పరిశీలన, వాటి సంరక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంటున్నది. అదే సమయంలో నర్సరీల నిర్వహణ, ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ల నిర్వహణ, పన్నుల వసూలు, పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ సభలు, సమావేశాలు, పంచాయతీ కార్యకలాపాలు, రికార్డులు వంటి పనులు పర్యవేక్షఇస్తున్నారు. వీటికి తోడు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకులకు సంబంధించిన బయోమెట్రిక్ మిషన్ల పనిని కూడా వీరికే అప్పగించింది. ప్రతి నెలలో వారం రోజుల పాటు రేషన్ షాపుల వద్ద వీరు విధులు నిర్వహించాల్సి వస్తున్నది. గడిచిన ఏడు నెలలుగా ఉపాధి హామీ పనుల గుర్తింపు, పరిశీలన, కూలీల వివరాలు వంటి పనులు కూడా వీరికే అప్పగించడంతో పని భారం మరింత పెరిగింది.

రాజీనామాలు ..

ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది పంచాయతీ కార్యదర్శులపై జాబులకు రిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చిన తరువాత కార్యదర్శులపై భారం మరింత పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరుకు సుమారు 176మంది పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అటు పనిభారంతో పాటు ఇటు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, పొలిటికల్ ప్రెషర్ తట్టుకోలేక చాలా మంది వేధన అనుభవిస్తున్నారు.

Next Story